నొప్పుల ఇంజెక్షన్‌.. నోస్టాక్‌

19 Feb, 2018 15:34 IST|Sakshi

రెండు నెలలుగా నిలిచిన సరఫరా 

ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఇక్కట్లు 

ఉమ్మడి జిల్లాలో టీకాల కొరత 

ప్రతి నెలా 60 వేల  ఇంజెక్షన్లు అవసరం 

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నొప్పుల ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నొప్పుల నివారణకు గాను డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా లేదు. కొన్నిచోట్ల ఈ ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రలు అందజేస్తుండగా, మరికొన్ని చోట్ల అవి కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో రోగులకు అవస్థలు తప్పటం లేదు.

నిజామాబాద్‌అర్బన్‌:  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. వీటి పరిధిలో ప్రతి నెల దాదాపు 60 వేల వరకు డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. వినియోగాన్ని బట్టి జిల్లాకు టీకాల సరఫరా ఉంటుంది. నిజామాబాద్‌లోని గంగాస్థాన్‌లో గల సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి రెండు జిల్లాలకు మందులు సరఫరా చేస్తారు. అయితే రెండు నెలలుగా ఈ టీకాల సరఫరా నిలిచి పోయింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోజుకు 800 వరకు, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆరోగ్య కేంద్రాల్లో 200 నుంచి 300వరకు, కామారెడ్డిలో 500 వరకు డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్ల వినియోగం ఉంటుంది. మిగతా ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ వీటి వినియోగం ఎక్కువే. ప్రస్తుతం ఈ టీకాలు అందుబాటులో లేక రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. 

నొప్పుల నివారణలో కీలకం.. 
డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్‌ను ముఖ్యంగా నొప్పుల నివారణకు వినియోగిస్తారు. ప్రసవాలు, లేదా ఇతర ఆపరేషన్‌ అనంతరం నొప్పుల నివారణకు, అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి, జ్వరంతో వచ్చే నొప్పులకు కూడా ఈ డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్లను వినియోగిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాలు, ఇతర సాధారణ శస్త్రచికిత్సలు, అత్యవసర చికిత్సల సందర్భంలో రోగులకు నొప్పుల నివారణ ఇంజెక్షన్‌ ఎంతో ముఖ్యం. అయితే ఈ టీకాల కొరత ఉండడంతో ప్రస్తుతం ట్రామాడండల్‌ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాలు అందుబాటులో లేవు. ఈ టీకాలకూ కొరత ఉండడంతో, వీటిని కొనుగోలు చేస్తున్నారు.

రెండునెలలుగా సరఫరా లేదు.. 
రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంజెక్షన్లు వినియోగించాలంటే కొనుగోలు చేయాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రసవాల కోసం వచ్చే మహిళలకు నొప్పుల ఇంజెక్షన్‌ ఇవ్వడానికి టీకాలు అందుబాటులో లేవంటున్నారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమస్య ఉండడంతో జనరల్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు.

త్వరలో వస్తాయి.. 
డైక్లోఫెనక్‌ ఇంజెక్షన్ల సరఫరాకు సంబంధించి ఇదివరకే అధికారులకు నివేదించాం. త్వరలోనే జిల్లాకు టీకాలు వస్తాయి. కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు సంబంధించి సరిపోయేంత ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతాం. 
- జైపాల్‌రెడ్డి, ఈఈ, కేంద్ర ఔషధ గిడ్డంగి, నిజామాబాద్‌

 

మరిన్ని వార్తలు