రెండు తడులకే 10 టీఎంసీలు ఖాళీ

19 Jan, 2018 10:09 IST|Sakshi

ఎస్సారెస్పీలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టం

33 టీఎంసీలను 8 తడులకు వినియోగించేలా ప్రణాళిక

వారబందీ ప్రకారం నీటి విడుదల

నీటిని వృథా చేయొద్దంటున్న అధికారులు

బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఈ ఏడాది యాసంగిలో పంటలకు 33 టీఎంసీల నీటిని 8 తడులకు అందించే లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ రెండు తడులకే 10 టీఎంసీల నీరు వినియోగమైంది. దీంతో ఎస్సారెస్పీలో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. డిసెంబర్‌ 25 నుంచి వారబందీ ప్రకారం కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల నాటికి ప్రాజెక్ట్‌లో 47టీఎంసీల నీటి నిల్వ ఉంది. బుధవారం నాటికి రెండు తడులు పూర్తి కాగా, ప్రాజెక్ట్‌లో 37 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. రెండు తడులకే ప్రాజెక్ట్‌లో 10 టీఎంసీల నీరు తగ్గుముఖం పట్టగా, మరో 6 తడులకు నీరు అవసరం ఉంటుంది. అంటే ఈ లెక్కన మరో 30 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్‌ అధికారులు ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు 33 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించి, మిగితా నీటిని తాగునీటి అవసరాల కోసం, డెడ్‌స్టోరేజీ, నీటి ఆవిరికి లెక్కలు వేశారు.  

భానుడు ప్రతాపం చూపితే..
ప్రస్తుతం ఎండలు అంతగా లేకపోవడంతో రెండుతడులకు 10 టీఎంసీల నీటి వినియోగమే జరిగింది. కానీ రానున్న రోజుల్లో భానుడు ప్రతాపం చూపితే నీటి అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో 6 తడుల కోసం నీటి అవసరం ఎంతగా ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క టీఎంసీతో 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేపట్టవచ్చని ప్రాజెక్ట్‌ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు 40 టీఎంసీల నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్ణయించి, 33 టీఎంసీల నీటి వినియోగం చేపట్టాలని ఎలా ప్రణాళిక చేశారో అర్థం కాని ప్రశ్న.

ప్రస్తుతం ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా వారబందీలో పలు మార్పులు చేస్తూ నీటి విడుదల చేపడుతున్నారు. ప్రణాళిక ప్రకారం కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటి సరఫరా చేపట్టవద్దు. కానీ చివరి ఆయకట్టు వరకు నీటి సరఫరా అందడం లేదని ముందుగా 6 వేల క్యూసెక్కులకు పెంచారు. తరువాత 6500 క్యూసెక్కులకు పెంచారు. వారబందీలో తక్కువ రోజుల్లో ఎక్కువ నీటి సరఫరా చేపట్టే ప్రయోగం చేశారు. అయినా చిక్కులు తప్పడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయవద్దని ప్రాజెక్ట్‌ ఉన్నత అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయకట్టు రైతులు అధికారులతో సహకరించాలని కోరుతున్నారు.

నీటిని వృథా చేయవద్దు..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాలువల ద్వారా విడుదలయ్యే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నీటి వినియోగం, నీటి నిల్వపై ప్రభావం ఉంది. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అందరి సహకారంతో పంటలను గట్టెక్కించేలా నీటి సరఫరా చేపడుతాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎస్సారెస్పీ 

Read latest Nizamabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు