సిటీ సర్వీసులెన్నడో? 

22 Jan, 2018 16:48 IST|Sakshi

ఏళ్లుగా ఎదురు చూస్తున్న నగర వాసులు

కొనసాగుతున్న ఆటోవాలాల జోరు

సమయానుకూలంగా ప్రయాణికుల నుంచి వసూళ్లు 

రోజురోజుకు నగర పరిధి విస్తరిస్తున్నా అం  దుకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడటం లేదని నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తే వారు నిర్ణయించిన చార్జీలు ఇవ్వాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందంటున్నారు.  
 

నిజామాబాద్‌ నాగారం: నగరంలో సిటీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఏళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్టీసీ అధికారులు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ఆర్టీసీ సంస్థ ఎండీ జీవీ రమణారావు ఏడాదిక్రితం సిటీ బస్సులు ప్రారంభిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఆటోల జోరు కొనసాగుతోంది. ఆదాయ మార్గమున్నా ఆర్టీసీ మాత్రం సిటీబస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

నగర పరిధి రోజురోజుకు నలువైపులా విస్తరిస్తూనే ఉంది. ఏవైపు వెళ్లినా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కాలనీలు వెలిశాయి. దీంతో నగరనడిబొడ్డున ఉన్న బస్టాండ్‌ నుంచి శివారు కాలనీలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గల్లీలో నుంచి బస్టాండ్‌కు వెళ్లాలన్నా, బస్టాండ్‌నుంచి గల్లీలోకి  వెళ్లాలన్నా ఆటోలే దిక్కు. ఇదే అదనుగా ఆటోవాలలు అందినకాడికి దండుకుంటున్నారు. బస్టాండ్‌ నుంచి కంఠేశ్వర్‌ మీదుగా దాస్‌నగర్‌ వరకు, అలాగే బస్టాండ్‌ నుంచి పూలాంగ్‌ మీదుగా మాధవనగర్‌ వరకు, బస్టాండ్‌ నుంచి వర్నిచౌరస్తా మీదుగా నాగారం వరకు, మరోవైపు గాంధీచౌక్, అర్సపల్లి మీదుగా సారంగపూర్‌ వరకు 5కిలో మీటర్ల పైనే విస్తరించింది. నగరంలోని 50 డివిజన్ల పరిధిలో 100కు పైగా కాలనీలున్నాయి. దీంతో బ స్టాండ్‌ నుంచి శివారు ప్రాం తాల్లోని ఏ కాలనీకి వెళ్లాలన్నా ఆటోవాలాలు రూ. 10 నుంచి 30వరకు వసూ లు చేస్తున్నారు. అదే రాత్రి 8గంటలకు దాటితే ఒక్కోరికి రూ.20 నుంచి రూ.50 కి పైగా వసూలు చేస్తు న్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో 6వేల నుంచి 8వేల వరకు ఆటోలున్నాయి.  

సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ భరోసా 
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం. ఇది అందరికి తెలిసిందే. ప్రైవే ట్‌ ఆటోలో ప్రయాణం చేయాలంటే రాత్రుల్లో నగర ప్రజలు జంకుతున్నారు. ఆటోవాలల ఆగడాలు గురించి అందరికి తెలిసిందే. ఆర్టీసీ సిటీ సర్వీసులను తిప్పితే రాత్రి వేళల్లో సైతం సురక్షితంగా ఇంటికి చేరుకొవచ్చని నగరప్రజలంటున్నారు. నగరంలోని రోడ్లు విస్తరిస్తుండటంతో పాటు పునరుద్ధరిస్తుండటంతో బస్సులు నడపాలని కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు