విహారయాత్రలో విషాదం

2 Jan, 2018 08:46 IST|Sakshi

విద్యుత్‌ వైరు తగిలి బాన్సువాడ విద్యార్థి మృతి 

మరో విద్యార్థి సీరియస్‌ 

భద్రాద్రి జిల్లాలో ఘటన 

బాన్సువాడ/అశ్వారావుపేటరూరల్‌: సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కళాశాల విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. విద్యుత్‌ షాక్‌ తగిలి తోటి స్నేహితుడు కళ్లముందే ప్రాణాలర్పించగా, మరో స్నేహితుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో జరిగిన ఈ ఘటనతో బాన్సువాడలోని రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో, బిచ్కుంద మండలం వాజిద్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. విద్యుత్తు షాక్‌తో బిచ్కుంద మండలం వాజిద్‌నగర్‌కు చెందిన మోడె సందీప్‌(17) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సతీష్‌ గుండాకు తీవ్ర గాయాలపాలయ్యాడు. 

కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత ఐదు రోజుల క్రితం పట్టణంలోని రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలకు చెందిన 70 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం విశాఖపట్టణం, విజయవాడకు వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయణమయ్యారు. సోమవారం ఉదయం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ముత్యాలమ్మ దేవస్థానం వద్ద ఆగారు. తుఫాన్‌ వాహనాల్లో వెళ్లిన ఈ విద్యార్థులు అందరూ వాహనాల నుంచి దిగి దైవ దర్శనానికి వెళ్లారు. అదే సమయంలో సతీష్‌ అనే యువకుడు తుఫాన్‌పైనున్న లగేజీని తీసుకొనేందుకు ఎక్కాడు. 

అయితే ఆ వాహనంపైనే హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు ఉండడంతో అతను వైర్లకు తగిలాడు. దీంతో వాహనం మొత్తం విద్యుత్‌ స్పార్క్‌కు గురైంది. వాహనానికి ఆనుకొని ఉన్న సందీప్‌ సైతం షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని అశ్వారావుపేటలోని కార్తికేయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సందీప్‌ మృతిచెందాడు. సతీష్‌ను హుటాహుటీన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో మిగితా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. తోటి మిత్రుడిని కోల్పోయామంటూ వారు రోదిస్తున్నారు.  

చివరి నిమిషంలోనే యాత్రకు..!? 
ఒకేషనల్‌ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం విహార యాత్రకు వెళ్తుండగా.. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వద్దని వారించినట్లు తెలిసింది. తోటి విద్యార్థులు సందీప్, సతీష్‌లను వారి తల్లిదండ్రులను పట్టుబట్టారు. దీంతో చివరి నిమిషంలో వారు యాత్రకు రాగా ఇలా జరిగింది.  

అమ్మానాన్నలకు ఎలా చెప్పాలిరా..? 
ఈ బృందంలోని సందీప్, సతీష్‌తోపాటు మరో విద్యార్థి సాయి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరంతా ఒకే బెంచీలో కూర్చుంటారు. కళాశాలలో కలిసే భోజనం చేస్తారు. ఇంత ప్రాణస్నేహితుల్లోంచి సందీప్‌ మృతిచెందగా, సతీష్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తోటి విద్యార్థులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడ చనిపోయావేంటిరా.. అమ్మానాన్నలకు ఏమని చెప్పాలిరా.. అంటూ రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

వాజిద్‌నగర్‌లో విషాదం
కాగా ఈ సంఘటనను తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.  మృతుడు సందీప్‌ తండ్రి విఠల్‌ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతడికి సందీప్, సతీష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సందీప్‌ బాన్సువాడలోని రేణుక ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఫస్టియర్‌ చదువుతున్నాడు. కొడుకు చనిపోవడంతో విఠల్‌ దంపతుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ సతీష్‌ తండ్రి సాయిలు కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సందీప్, సతీష్‌ ఇద్దరు మంచి మిత్రులు. వీరు ఎక్కడ వెళ్లినా కలిసి వెళ్తారు. విద్యుత్‌షాక్‌ రూపంలో సందీప్‌ ప్రాణాలను కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

మరిన్ని వార్తలు