ఉపాధ్యాయుడు మందలించడంతో.. 

10 Feb, 2018 16:19 IST|Sakshi
పాఠశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు 

 పారిపోయిన విద్యార్థి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లోకి దూరిన వైనం..

 త్రుటిలో తప్పిన ప్రమాదం

 నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు

నస్రుల్లాబాద్‌: మండలంలోని బొమ్మన్‌దేవ్‌ పల్లి క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ వెంకట సాయి విద్యానికేతన్‌ పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థి స్కూల్‌ నుంచి వెళ్లిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది. కంగ్టీ మండలం చాప్టా గ్రామానికి చెందిన ఓ విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఉపాధ్యాయుడు దుర్భాషలాడి, కొట్టడంతో సదరు విద్యార్థి స్థానిక  33/11కేవీ సబ్‌స్టేషన్‌లోకి పరిగెత్తాడు. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బాలుడికి మందలించి తిరిగి పాఠశాల ఉపాధ్యాయుడికి అప్పజెప్పి పాఠశాల యాజమాన్యానికి సమాచారమిచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ సదరు విద్యార్థికి మానసిక పరిస్థితి సరిగ్గాలేక గతంలోనూ ఇలాగే వెళ్లిపోయాడని, తనకు మానసిక పరిస్థితి లేదని మెడికల్‌ రిపోర్ట్‌ కూడా అందించాడని పేర్కొన్నారు. అయితే సదరు విద్యార్థి మాత్రం తాను స్కూల్‌కు నోట్‌బుక్‌ తెచ్చికోలేదని తిరిగి వెళ్తూ సార్‌ చూ స్తే కొడ్తాడని సబ్‌స్టేషన్‌లోకి వెళ్లాలని చెప్పాడు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగాయి. పాఠశాల యాజమాన్యం అధికఫీజు ఒత్తిడివల్లే విద్యార్థి మనస్థాపానికి గురై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ఈ ధర్నాలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాల్‌రాజ్, బీసీ విద్యార్థి సంగం జిల్లా కార్యదర్శి కర్నం భాస్కర్, ఏబీవీపీ రాజు, సాయిలు, జగన్, అస్లాం, గిరి తదితరులున్నారు.    
 

మరిన్ని వార్తలు