అమెరికాలో అద్భుత స్పందన

19 Aug, 2019 05:30 IST|Sakshi
నవరత్నాలు, జయహో జగనన్న, జగనన్నకు స్వాగతం అనే గీతాలకు చేసిన నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.చిత్రంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రత్నాకర్‌ తదితరులు

అడుగడుగునా ఘన స్వాగతం 

తెలుగు ప్రముఖులతో సమావేశం

ప్రవాసాంధ్రులను ఆకట్టుకున్న జగన్‌ ప్రసంగం

డాలస్‌ (అమెరికా): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికా పర్యటనలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు ఈ సమావేశానికి అంచనాలకు మించి హాజరు కావడం విశేషం. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి) డాలస్‌ విమానాశ్రయానికి సైతం పెద్దఎత్తున తరలి వచ్చిన ప్రవాసాంధ్రులు జై జగన్‌ అంటూ కేరింతల మధ్య ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌ అక్కడే అమెరికాలోని తెలుగు ప్రముఖులతో సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టెక్సాస్‌ రాష్ట్ర ప్రతినిధులు కూడా జగన్‌ను అక్కడే కలుసుకున్నారు. ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించడానికి హచిన్సన్‌ ప్రాంతం చేరుకున్నప్పుడు ఆహూతులను అదుపు చేయడానికి అమెరికన్‌ భద్రతా సిబ్బంది బాగా ప్రయాస పడాల్సి వచ్చింది. సభా హాలులో నవరత్నాలుపై రూపొందించిన గీతంతో, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ‘నాకొక కల ఉంది...’ అని మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ మాటలను ఉటంకించినప్పుడు మంత్రముగ్ధులయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తున్నప్పుడు హర్షామోదాలు వ్యక్తం అయ్యాయి. అమెరికా–భారత్‌ రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.


అమెరికాలో భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభ అనంతరం నేరుగా డల్లాస్‌ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడ స్థానిక ప్రవాసాంధ్రులంతా ఘనంగా వీడ్కోలు పలికారు. కెనడాలోని టొరాంటో, మాంట్రియల్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ, పిట్స్‌బర్గ్, డెట్రాయిట్, షికాగో, ఓహియో, ఆరిజోనా, సియాటెల్, కాలిఫోర్నియా బే ఏరియా, ఎల్‌ఏ, నార్త్‌ కాలిఫోర్నియా, సెంట్‌ లూయిస్, ఓక్లహామా, అట్లాంటా, ఫ్లోరిడా, ఆస్టిన్, హ్యూస్టన్, డాలస్‌ నుంచి ప్రవాసులు హాజరయ్యారు. కాగా, ‘స్వాగత సుమాంజలి’ పేరుతో ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సన్మానపత్రాన్ని బహూకరించారు. 

రాష్ట్రాభివృద్ధికి సహకరించండి  
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించాలంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పలు కంపెనీల ప్రతినిధులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వాషింగ్టన్‌ డీసీలో ఆదివారం ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. (చదవండి: ఇది మీ ప్రభుత్వం.. ఆనందంగా రండి)

మరిన్ని వార్తలు