కేంద్ర, రాష్ట్రాలు కఠిన చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి

5 Dec, 2019 14:46 IST|Sakshi

అట్లాంటా: భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై అట్లాంటాలోని ప్రవాసాంధ్రులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో స్థానిక బిర్యాని పాట్‌ రెస్టారెంట్‌లో అత్యాచారం, హత్యకు గురైన దిశకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అట్లాంటాలోని ప్రవాసాంధ్రులతో పాటు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ విజిల్‌లో భాగంగా క్యాండిల్స్‌ వెలిగించి దిశకు నివాళులర్పించారు. 


అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అదే సమయంలో వారిపై దాడులు కూడా ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన సభ్యులు శ్రీరాం, జయచంద్రారెడ్డి, నిరంజన్‌ పొద్దుటూరికి ఆటా కార్యవర్గ సభ్యులు అనిల్‌ బొడిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా మాజీ అధ్యక్షులు కరుణాకర్‌ అసిరెడ్డి, కిరణ్‌ పాషం, గౌతం గోళి వెంకట్‌ మొండెద్దు, శ్రీని గంగసాని, అనిల్‌ బోదిరెడ్డి, తంగిరాల సత్యనారాయణ రెడ్డి, కళ్యాణి మోడ్గుల, హేమ శిల్ప తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు