ఫేక్‌ యూనివర్సిటీ కలకలం; రంగంలోకి ‘ఆటా’

1 Feb, 2019 15:05 IST|Sakshi

న్యూజెర్సీ : వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిని పట్టుకునేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా బాధితులను ఆదుకునే క్రమంలో ఇండియన్‌ ఎంబసీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌రెడ్డి తెలిపారు. అదే విధంగా నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఆటా వెబినార్‌ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పరమేష్‌ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో విద్యార్థులకు మరే ఇతర దేశం కల్పించని గొప్ప అవకాశాలు అమెరికా కల్పిస్తుందన్నారు. ఇక్కడ నివసించేందుకు విద్యార్థులు అడ్డదారులు తొక్కడం సరికాదని, చట్టాలను అతిక్రమించడం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆటా వెబినార్‌ సదస్సులో భాగంగా అట్లాంటాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌ అటార్నీలు రవికుమార్‌ మన్నం, మైఖేల్‌ సోఫో, హేమంత్‌ రామచంద్రన్‌ విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

1. కమిషన్‌ ఏజెంట్లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
2. ఎక్కువ కమిషన్‌కు కక్కుర్తి పడి నకిలీ ఏజెంట్లు యూనివర్సిటీల గురించి ఎటువంటి ఆరా తీయకుండానే విద్యార్థులకు అందులో అడ్మిషన్లు చేయిస్తున్నారు. మనం కూడా ఒకసారి సదరు యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవాలి.
3. నిజమైన యూనివర్సిటీలు టోఫెల్‌ఐఈ/ఎల్‌టీఎస్‌/జీఆర్‌ఈ స్కోరు కార్డు అడుగుతాయన్న విషయాన్ని గమనించాలి.
4. మనం చేరబోయే కాలేజీకి సంబంధిత శాఖల నుంచి అక్రిడేషన్‌ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం.
5. విద్యార్థిగా వచ్చినప్పుడు విద్యాభ్యాసమే ప్రాథామ్యం కావాలి. అంతేగానీ సంపాదన కోసం సులువైన మార్గాలు ఎంచుకోవడం అంటే చట్ట వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్నట్లే.
6. ఎక్కువగా ప్రాచుర్యం లేని, అనుమానాస్పద యూనివర్సిటీల్లో చేరకపోవడమే ఉత్తమం. కొంతమంది నకిలీ ఏజెంట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు వారి ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్లు సేకరించి వీసా కోసమని డబ్బులు వసూలు చేస్తారు. ఫలానా యూనివర్సిటీలో చేరితే ఎన్నో లాభాలు ఉంటాయంటూ మభ్యపెడతారు. కానీ తీరా వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లిన తర్వాత ఎటువంటి స్కూలుగానీ, యూనివర్సిటీ గానీ ఉండదు. కాబట్టి అటువంటి ఆకర్షణలకు లొంగకపోవడమే మంచిది.
7. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు  https://www.ice.gov/ సైట్‌ను సంప్రదించవచ్చు.
8. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) ఆఫీసర్లను సంప్రదించినట్లైతే బంధీలుగా ఉన్న విద్యార్థులను కలిసే అవకాశం ఉంటుంది. సాధారణంగా వారిని సిటీకి దూరంగా ఉంచుతారు.

ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం info@ataworld.org లేదా atahelp@ataworld.org సైట్‌ను దర్శించవచ్చు.
సందేహాల నివృత్తికై https://docs.google.com/forms/d/10LKzRHEF3zqwRsZjC8-Ekgk4ukBp619G-Z7opAwveEM/edit?usp=sharing క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు