పిల్లల ఆపరేషన్లకు ఎన్‌ఆర్‌ఐల భారీ విరాళం

22 Aug, 2019 20:42 IST|Sakshi

అట్లాంటా : హృదయ సంబంధ లోపాలతో జన్మించే పేద దేశాలకు చెందిన పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించే హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్‌కు ప్రవాస భారతీయులు 1.2 లక్షల డాలర్ల (రూ. 85 లక్షలు) సహాయం అందించారు. ఫౌండేషన్ తరపున ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు ఈ నిధులను అందజేశారు. అమెరికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ వేణు కుమార్ రెడ్డి పిసికె ఆధ్వర్యంలో అట్లాంటా క్రికెట్ లీగ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు, క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. గౌతమ్ గోలి, ఫణి గుమ్మరాజు, మహేశ్ పవార్, కిరణ్ మంచికంటి, కరుణాకర్ పిసికె తదితరులు నిధుల సేకరణలో ముఖ్య పాత్ర పోషించారు.

హార్ట్ టు హార్ట్ విత్ సునీల్ గవాస్కర్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహ్వానితులు ఉదారంగా విరాళాలు అందజేశారు. తన క్రికెట్ కెరీర్లో సాధించిన 34 టెస్ట్ సెంచరీలకు గుర్తుగా గవాస్కర్ ఇటీవల 40,800 డాలర్లు అందజేశారు. ఒక్కో గుండె ఆపరేషన్‌కు 1200 డాలర్లు ఖర్చవుతుంది. రెండు నెలల క్రితం ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ పోటీల సందర్భంగా అమెరికా క్రికెట్ బోర్డు తరపున తనను మర్యాద పూర్వకంగా కలిసిన వేణు కుమార్ రెడ్డి పిసికె, ఫణి గుమ్మరాజులను నిధుల సేకరణకు సహకరించాల్సిందిగా గవాస్కర్ కోరారు. అంతకు ముందే కొన్ని నగరాల్లో ఆయన పర్యటన ఖరారు కాగా అట్లాంగా సిటీని కూడా చేర్చి ఆహ్వనం పలికారు.  1971 లో వెస్టిండీస్ తో ఆడే టెస్ట్ మ్యాచ్ కు సెలక్ట్ అవడంలో తనకు అదృష్టం కూడా కలిసొచ్చిందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఒక స్థానానికి ముగ్గురు క్రీడాకారులు పోటీ పడగా ఆయన ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు రెండు క్యాచ్ లను వదిలేశారు. దానితో ఎక్కువ స్కోర్ సాధించి సెలక్టర్ల దృష్టిలో పడ్డట్టు తెలిపారు. అప్పుడప్పుడు హెల్మెట్ తీసి బ్యాటింగ్ చేసేవారు రిస్క్ అనిపించలేదా? అని ఆహుతుల్లో ఒకరు ప్రశ్నంచగా తన తలలో మెదడు ఉంటే గదా భయపడటానికి అని సరదాగా చమత్కరించి అందర్నీ నవ్వుల్లో ముంచారు.

మరిన్ని వార్తలు