మోసాలకుఅడ్డుకట్ట వేయలేమా..

16 Nov, 2019 12:39 IST|Sakshi
విదేశాలలో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసిన వరంగల్‌లోని కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు (ఫైల్‌)

కొనసాగుతున్న ఏజెంట్ల వంచన

ఆకర్షణీయ ప్రకటనలతో ఇంటర్వ్యూలు

అవగాహన లేక బలవుతున్న గ్రామీణులు

గల్ఫ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై పోలీసుల నిఘా కరువు

మోర్తాడ్‌: మోసపోయేవారు ఉన్నంత కాలం.. మోసగించేవారు ఉంటారు అనే నానుడికి గల్ఫ్‌ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే వారు ఎక్కడో ఏదో విధంగా మోసపోతూనే ఉన్నారు. ఇటీవల పలు ఘటనలు వెలుగుచూశాయి. షార్జాలోని బల్దియాలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా యని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి దాదాపు 300 మంది నిరుద్యోగులను నమ్మించి రూ.5 కోట్లతో ఉడాయించిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది. నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన ఆ యువకుడు నకిలీ వీసాలను నిరుద్యోగులకు అంటగట్టాడు. ఆ వీసాలతో కార్మికులు షార్జాకు వెళ్లే ప్రయత్నంలో ఎయిర్‌పోర్టులో అధికారులు గుర్తించి తిప్పిపంచారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి వీసాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.3 కోట్లు వసూలు చేసిన ఓ ఏజెంటు బాగోతాన్ని వరంగల్‌ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు.

ఇవే కాకుండా.. గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం అనధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కొందరిని నిజామాబాద్, కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. గల్ఫ్‌ వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిరుద్యోగుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న మోసగాళ్లు అమాయకులను వంచనకు గురిచేస్తున్నారు. ఇదిలావుండగా.. కొందరు లైసెన్స్‌డ్‌ ఏజెంట్లు గల్ఫ్‌ దేశాలకు మొదట విజిట్‌ వీసాలపై మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిట్‌ వీసాలపై వెళ్లి గల్ఫ్‌ దేశాల్లో పనులుచేస్తే ఎన్నో విధాలుగా నష్టపోతారు.  నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో విజిట్‌ వీసాలపైనే గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నారు. 

ఎస్‌ఓపీపై పోలీసులకు అవగాహన..
విదేశాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అండగా విదేశాంగ శాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌ఓపీ)ని రూపొందించింది. ఈ ఎస్‌ఓపీపై రాష్ట్ర పోలీసులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను మోసం చేసిన ఏజెంట్లపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో బాధితులకు ప్రయోజనం కలుగడం లేదు. వీసా మోసాలపై కఠినంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగడంతో పాటు మోసాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వీసా మోసాలపై అవగాహన కల్పిస్తున్నాం..
విదేశాలకు వెళ్లాలనుకునే వారు వీసాలను పొందే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మా టామ్‌కామ్‌ సంస్థ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వీసాలు పొందిన తరువాత అవి నకిలీవా లేక సరైనవా అని నిర్ధారించుకోవడానికి వలసదారులకు వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌లలో పరిశీలించి వీసాలను నిర్ధారించుకోవాలి. వలసదారులు రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే వీసాల కోసం ప్రయత్నం చేయాలి. లైసెన్స్‌ లేని ఏజెంట్లను వీసాల కోసం సంప్రదించవద్దు. జాగ్రత్తగా వ్యవహరిస్తే మోసపోకుండా ఉంటారు. వలస వెళ్లాలనుకునేవారికి తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ అండగా ఉంటుంది.

సాధారణ కేసుల నమోదుతో ప్రయోజనం లేదు  
వీసా మోసాలపై పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తే ప్రయోజనం లేదు. వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయడం వల్ల ఏజెంట్లు సులభంగా తప్పించుకుంటున్నారు. ఎమిగ్రేషన్‌ యాక్ట్‌ 1983తో పాటు ఐపీసీ 370 (మానవ అక్రమ రవాణా) కింద కేసులు పెట్టాలి. నకిలీ ఏజెంట్లు, మోసగించిన ఏజెంట్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. మోసాలను అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. వీసా రాకెట్‌లో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న చైన్‌ మొత్తాన్ని కేసు పరిధిలోకి తీసుకురావాలి.

వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం..
విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. అనేక మంది కార్మికులు ఎలాంటి శిక్షణ లేకుండానే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళుతున్నారు. అక్కడ పనిపై అవగాహన లేకపోవడంతో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఏజెంట్లు ఫలానా పని అని చెబితే ఆ పనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ పొంది విదేశాలకు వెళ్తే ఎలాంటి నష్టమూ ఉండదు. కార్మికులు కచ్చితంగా తాము ఉపాధి పొందే రంగంలో శిక్షణ పొంది ఉండాలి.

అవగాహన కల్పించాలి
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న చాలామంది యువత అవగాహన లోపంతోనే మోసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్‌పైనా అవగాహన లేకపోవడంతో ప్రైవేటు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. చదువుకున్న యువత కూడా ముందువెనకా ఆలోచించకుండా వెళ్లి బలవుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి.

మరిన్ని వార్తలు