అవగాహన లోపంతోనే..

26 Jul, 2019 08:46 IST|Sakshi

రాసం శ్రీధర్, నిర్మల్‌ :గల్ఫ్‌ దేశాల్లో వివిధ ప్రమాదాల్లో తెలంగాణ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదికి దాదాపు 200 శవపేటికలు శంషాబాద్‌ విమానాశ్రాయానికి చేరుతున్నాయని అంచనా. చాలామంది అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో మృతిచెందుతుండగా, మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.   
మనదేశంలో రోడ్లపై ఎడమవైపు ప్రయాణిస్తాం.అదే గల్ఫ్‌ దేశాల్లో రోడ్డుకు కుడిపక్కన వెళ్లాల్సి ఉంటుంది.  ఈ విషయం తెలిసినా ఒక్కోసారి మనవాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదానికి గురవుతున్నారు.
మన దేశంలో ఏ రోడ్డుపైనైనా(కొన్ని మినహా) అన్ని రకాల వాహనాలు వెళ్లొచ్చు. కానీ, సౌదీ వంటి గల్ఫ్‌ దేశాలలో రోడ్లను బట్టి వాహనాలను అనుమతిస్తారు. ఇటీవల మంచిర్యాల జిల్లావాసులు ప్రమాదానికి గురైన రోడ్డుపై బైక్‌లను నడపడం నిషేధం.  
రోడ్డు క్రాసింగ్‌ల వద్ద అవగాహన లేకపోవడమూ ప్రాణాలు తీస్తోంది.   
సీటు బెల్టు పెట్టుకోకున్నా.. హెల్మెట్‌ ధరించకున్నా.. ఆ దేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయి.
పని ప్రదేశాల్లోనూ హెల్మెట్లు వాడకపోవడం, రసాయనాలకు సంబంధించిన పనుల్లో షూ, మాస్కులు ధరించకపోవడం ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
రోజంతా 40–45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో పనిచేసి, తర్వాత 20–25 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండే ఏసీ గదుల్లోకి రావడం కూడా మనవాళ్లపై ప్రభావం చూపుతోంది. చాలా మంది ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసాలతో అనారోగ్యం బాడినపడి కన్నుమూస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లినవారిలో కొందరు అక్కడ ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

‘దియా’ ఉన్నా..
గల్ఫ్‌ దేశాల్లో చట్టాలు, నిబంధనలపై కనీస అవగాహన లేకపోతే మనిషితో పాటు ఆర్థికసాయం కూడా కోల్పోవాల్సి వస్తుంది. సౌదీలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఇస్లామిక్‌ షరియా ప్రకారం వారు ‘దియా’ (బ్లడ్‌ మనీ) చెల్లిస్తారు. ఇది లక్ష నుంచి 2లక్షల సౌదీ రియాళ్ల వరకు ఉంటుంది. మన కరెన్సీ ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.36లక్షల వరకు ఇస్తారు. కానీ, ఈదియాను పొందాలంటే ఓ నిబంధన ఉంది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తప్పులేదని నిరూపించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నా, మద్యం సేవించి నడిపినా, రెడ్‌ సిగ్నల్‌ క్రాస్‌ అయినా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా, వాహనం ఫిట్‌నెస్‌ లేకున్నా.. దియా వర్తించదు. అక్కడి చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండి, సదరు వ్యక్తి తప్పులేకపోతేనే బ్లడ్‌మనీ ప్రమాదస్థాయిని బట్టి చెల్లిస్తారు.

సౌదీలో మనిషిని బట్టి..
రోడ్డు ప్రమాదాలతో పాటు అన్ని రకాల ప్రమాదాలకు దియా అందిస్తారు.  అయితే, సౌదీ అరేబియా దేశంలో మనిషిని బట్టి పరిహారం చెల్లింపులు ఉంటాయి. మృతుడు ముస్లిం పురుషుడైతే 100శాతం పరిహారం అందుతుంది. ముస్లిం మహిళకు అందులో 50శాతం, క్రిస్టియన్‌ పురుషుడైతే 50శాతం, క్రిస్టియన్‌ మహిళ ఉంటే అందులో సగం పరిహారం చెల్లిస్తారు. ఇక ముస్లిం, క్రిస్టియన్లుకాని వారందరికీ కేవ లం 6.6శాతం మాత్రమే పరిహారం అందిస్తారు. ఈ లెక్కన ముస్లిం పురుషుడికి రూ.లక్ష వస్తే, క్రైస్తవ పురుషుడికి రూ.50వేలు.. మిగతా వర్గాలకు చెందిన పురుషుడికి రూ.6,600 మాత్రమే వస్తాయి. అన్ని వర్గాల మహిళలకు అందులో సగమే చెల్లిస్తారు.

బీమా చేసుకోవడం ఉత్తమం
గల్ఫ్‌ దేశాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు కనీస పరిహారం కూడా పొందలేని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గల్ఫ్‌కు వెళ్లేవారిలో చాలామంది జీవిత బీమా కూడా చేయించుకోవడం లేదు. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే రూ.లక్ష విలువైన జీవిత బీమా వర్తించే పాలసీలనూ తీసుకోవడం లేదు. ఇక.. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రవాసీ భారతీయ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాద బీమా రూ.10లక్షలు ఉంటుంది. ఇది కొత్తగా వెళ్లే వారికి మాత్రమే వర్తిసుంది. అందులో పదోతరగతి కంటే తక్కువ చదివిన వారికి అంటే.. అక్షరాస్యత పరంగా వెనుకబడిన వారికి వర్తిస్తుంది. ఇందులో రూ.275 చెల్లిస్తే రెండేళ్లు, రూ.375 చెల్లిస్తే మూడేళ్లు కవరేజీ ఉంటుంది. ఈ చెల్లింపులపైన జీఎస్టీ 18శాతం వసూలు చేస్తుండటం గమనార్హం. ఇది కాకుండా ఎల్‌ఐసీ, ఇతర బీమా కంపెనీలలో జీవిత, ప్రమాద బీమాలు చేయించుకోవడం ఉత్తమం. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా