-

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అట్లాంటాలో మహాసభ

13 Jan, 2019 23:07 IST|Sakshi
అట్లాంటాలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

అట్లాంటా(అమెరికా): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు ఉత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అట్లాంటా ఎన్‌ఆర్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో అట్లాంటాలో జనవరి 12న మహాసభ జరిగింది. ఈ మహా సభ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. అలాగే అట్లాంటా పక్క రాష్ట్రాలైన జార్జియా, టెన్నిసీ, ఫ్లోరిడా, అలబామా, సౌత్‌ కరోలినా, నార్త్‌ కరోలినాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, వారి అమూల్యమైన సందేశాలను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో వారికున్న అనుబంధాలను సభలో గుర్తు చేసుకున్నారు.

వైఎస్‌ జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను ఎందుకు ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటున్నారు.. అనే విషయాలను కార్యకర్తలకు తెలియజేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ అండ్‌ ఎల్లో మీడియాతో కలిసి చేస్తున్న అరాచకాలను వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడంతోనే అడ్డుకట్ట వేయగలమని వివరించారు. సభలో పాల్గొన్న వక్తలు, కార్యకర్తలకి దిశానిర్దేశం, రాబోయే ఎన్నికల్లో ప్రవాస భారతీయులు వైఎస్సార్‌సీపీకి ఎలా సహకరించాలో స్పష్టంగా తెలియజేశారు. సభలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, షర్మిల, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు ఏపీలో చేసిన పాదయాత్రల లఘు చిత్రాలను ప్రదర్శించి కార్యకర్తలకు ఉత్తేజాన్ని అందించారు.

అలాగే సభలో వైఎస్‌ఆర్‌ బయోపిక్‌ ‘యాత్ర’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శించారు. కొంత మంది కార్యకర్తలు పాటలు, ప్రజాసంకల్పయాత్ర విశిష్టతను, వైఎస్‌ జగన్‌ అమలు చేయబోయే నవరత్నాలను కవితల రూపంలో వివరించారు. సభ మొత్తం కూడా కార్యకర్తల కోలాహలంతో, నూతన సభ్యుల చేరికతో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికంగా వాతావరణం సహకరించకున్నా ఉదయాన్నే లేచి వచ్చి వైఎస్‌ జగన్‌పై, వైఎస్‌ఆర్‌సీపీపై ఉన్న ఇష్టాన్ని చాటుకున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలకు, సహాయ సహకారాలు అందించిన వైఎస్సార్‌సీపీ అభిమానులకు వైఎస్సార్‌సీపీ అట్లాంటా ఎన్‌ఆర్‌ఐ కమిటీ వారు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు