బోనమెత్తిన సింగపూర్‌

29 Jul, 2018 20:47 IST|Sakshi

సింగపూర్‌ : నగరంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌ రెండోసారి బోనమెత్తింది. స్థానిక సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ టెంపుల్‌లో ఆదివారం ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకలో సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల పండుగను గత ఏడాది కూడా టీసీఎస్‌ఎస్‌ ఘనంగా నిర్వహించింది. రెండో ఏడాది కూడా విజయవంతంగా బోనాల పండుగను నిర్వహించడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలియ చేశారు. ప్రజలందరిపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు.

బోనాల పండుగలో పాల్గొని అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సొసైటి అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, శివ రామ్ ప్రసాద్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ఇతర సభ్యులు నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, అనుపురం శ్రీనివాస్, కల్వ రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా లక్ష్మా రెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్, బొండుగుల రాము, జుట్టు ఉమేందర్, జూలూరి పద్మజ, నడికట్ల కళ్యాణి, వెంగళ సృజన వ్యవహరించారు.

మరిన్ని వార్తలు