చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’

15 Sep, 2019 04:11 IST|Sakshi

చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీన నేపర్విల్‌లోని నార్త్‌ సెంట్రల్‌ కాలేజ్‌ ఫైఫర్‌ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్‌ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.  అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్‌ నార్త్‌ అమెరికా, ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌, చికాగో తెలుగు అసోషియేషన్‌, చికాగో ఆంధ్ర అసోషియేషన్‌ ఉన్నాయి. 

చికాగోలోని 8 డ్యాన్స్‌ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్‌ థియేటర్‌ గురువు జానకి ఆనందవల్లి నాయర్‌, ఆచార్య పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్‌ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్‌ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్‌, ప్రేరణ అకాడమి ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్‌ గురువు శోభ నటరాజన్‌, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. 

కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది.

కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్‌ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని  విశేష కృషి చేశారు. 

మరిన్ని వార్తలు