అవినీతిలో మనం ‘మహాన్’!

10 Jul, 2013 15:42 IST|Sakshi

 రెండేళ్లుగా దేశంలో పెచ్చరిల్లిన అవినీతి
 68% మందికి ప్రభుత్వంపై నమ్మకం లేదు
 పార్టీలు అవినీతిమయమైనవని 86% మంది అభిప్రాయం
 సామాన్యుడి అత్యవసరాలేవీ అందడం లేదు
‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ’ అధ్యయనంలో వెల్లడి

అభివృద్ధిలోనే కాదు అవినీతిలోనూ భారతదేశం అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇంతవరకు ఎన్నడూ లేనంతగా గత రెండేళ్లలో అవినీతి పెరిగిపోయింది. రాజకీయ పార్టీలు ఈ అవినీతికి కేంద్ర స్థానం అయితే.. పోలీసు, న్యాయవ్యవస్థలు ఆ స్థానం కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇదేదో మాట వరసకు చెబుతున్నదీ కాదు. రాజకీయ నేతల ఆరోపణా కాదు... ఇది దేశంలో 68 శాతం మంది ప్రజల అభిప్రాయం. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ సంస్థ అధ్యయనంలో తేలిన కఠోర వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అవినీతి అంశంపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఏటా ‘గ్లోబల్ కరప్షన్ బారోమీటర్’ పేరిట సర్వే నిర్వహించి, నివేదికను విడుదల చేస్తుంది.



ఈ ఏడాది కూడా 107 దేశాల్లో 1,14,270 మందిని ప్రశ్నించి నివేదికను విడుదల చేసినట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ఆసియా, పసిఫిక్ రీజియన్ మేనేజర్ రుక్షానా ననయక్కర తెలిపారు. ఆ నివేదిక ప్రకారం... దేశంలో గత రెండేళ్లుగా అవినీతి భారీగా పెరిగిపోయిందని సర్వేలో పాల్గొన్నవారిలో 68 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. అవినీతిని కట్టడి చేసే అంశంపై తమకు పూర్తిగా నమ్మకం లేదని స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలు అవినీతిమయమైనవేనని ఏకంగా 86 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక గత ఏడాదికాలంలో ప్రభుత్వాధికారులకు కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చామని 54 శాతం మంది వెల్లడించారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అవినీతిలో రాజకీయ పార్టీలు మొదటిస్థానంలో నిలవగా.. పోలీసు, న్యాయవ్యవస్థలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.



ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతోంది..
దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి కారణంగా అత్యవసరమైన సరుకులు, సేవలు సామాన్యుడికి అందడం లేదని నివేదిక హెచ్చరించింది. ఇది మొత్తంగా చట్టం, ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోందని.. అవినీతి కారణంగా కొన్ని సార్లు ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలుగుతోందని వెల్లడించింది. దీనివల్ల వనరుల సమర్థ, సమాన పంపకంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఈ అవినీతి చివరికి ప్రజలకు చట్టం పట్ల అసహ్యాన్ని కలిగిస్తోందని, సమాజ గౌరవానికి భంగం కలిగిస్తోందని తెలిపింది.



నివేదిక ప్రకారం అవినీతి ఎందులో ఎంత?
పోలీసు విభాగంలో 62 శాతం
రిజిస్ట్రేషన్లు, అనుమతులకు సంబంధించి 61 %
విద్యలో 48శాతం
భూమి సంబంధిత విభాగాల్లో 38 శాతం
న్యాయవ్యవస్థలో 36 శాతం



దేశాల వారీగా అత్యంత అవినీతి విభాగాలు..
51 దేశాల్లో రాజకీయ పార్టీలు
36 దేశాల్లో పోలీసు వ్యవస్థ
20 దేశాల్లో న్యాయవ్యవస్థ


ఇదీ ప్రజాభిప్రాయం..
వివిధ రంగాల్లో అవినీతి ఉందని చెప్పినవారి శాతం
రాజకీయ పార్టీల్లో ఉందన్నవారు - 86%
పోలీసుశాఖలో ఉందన్నవారు - 75%
ప్రభుత్వాధికారుల్లో ఉందన్నవారు- 65%
పార్లమెంటులో ఉందన్నవారు - 65%
న్యాయవ్యవస్థలో ఉందన్నవారు - 45%
మీడియాలో ఉందన్నవారు - 41%



సర్వే వివరాలు..
విషయం: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అవినీతి
సంస్థ: ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్
నివేదిక: ‘గ్లోబల్ కరప్షన్ బారోమీటర్-2013’
సమయం: సెప్టెంబర్ 2012 నుంచి మార్చి 2013 మధ్య
ఎక్కడ: ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల్లో అధ్యయనం
పాల్గొన్నది: 1,14,270(భారత దేశంలో 1,025 మంది)

మరిన్ని వార్తలు