డల్లాస్‌లో గాంధీ మెమోరియల్‌ను సందర్శించిన లక్ష్మణ్

27 Jul, 2018 10:48 IST|Sakshi

డల్లాస్‌, టెక్సాస్ : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ముషీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించడం తన అమెరికా పర్యటనలో ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందని అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి విశ్వ మానవుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని డల్లాస్‌లో నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీని సాధనలో కృషి చేసిన గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రవాస భారతీయులను లక్ష్మణ్ అభినందించారు. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ఈ మెమోరియల్ దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సముచితంగా ఉందని లక్ష్మణ్‌ అన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డాక్టర్. లక్ష్మణ్‌కు స్వాగతం పలుకుతూ ఇదే ప్రాంగణంలో ఆగష్టు 15 వ తేదీన భారతదేశపు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వందలాది ప్రవాస భారతీయుల మధ్య జరుపుకోవడానికి తగు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. తీరికలేని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా వీలు చేసుకొని గాంధీ మెమోరియల్‌ను సందర్శించినందుకు లక్ష్మణ్‌కు తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూతురు శ్రీనివాస్ రెడ్డి, అజయ్ కల్వల, సతీష్, భీమ పెంట, రవి పటేల్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు