యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

26 Jul, 2019 08:50 IST|Sakshi

1500 రకాల ప్రభుత్వ సేవల్లో కొన్నింటిపై పన్నుల తగ్గింపు.. మరికొన్ని రద్దు

వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల :గల్ఫ్‌ దేశాల్లో ప్రముఖమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ఆర్థిక సంస్కరణలు అమలవుతు న్నాయి. ఆ దేశంలోని 1500 రకాల ప్రభుత్వ సేవలపై ప్రస్తుతం విధిస్తున్న పన్నులను తగ్గించాలని, కొన్నింటిని రద్దుచేయాలని దుబాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు యూఏఈ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ కేబినెట్‌ నిర్ణయాన్ని వెల్లడించింది.

అక్కడ అన్ని పన్నులు వసూలు..
యునైటెడ్‌ అరబ్‌ దేశాల్లో ప్రభుత్వం విధించే అన్ని పన్నులు కచ్చితంగా వసూలవుతాయి. అయితే, యూఏఈ ప్రభుత్వంలోని అంతర్గత వ్యవహారాల శాఖ 1500 రకాల సేవలపై పన్నుల్లో కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటిని తగ్గించేందుకు నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ 80 రకాల సేవల పన్నులను, మానవ వనరులు, ఉపాధి కల్పన శాఖ 200 రకాల అంశాలపై విధిస్తున్న సేవల పన్నులు ఇందులో ఉన్నాయి.  

ఈ నెల నుంచే అమలు..
దేశంలో కొత్త పన్నుల విధానాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర పన్నుల విధానాన్ని, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి యూనిస్‌ హేజీ అల్‌ ఖూరీ తెలిపారు. ఈ చర్యల ఫలితాలను విశ్లేషించుకుని భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు.

ప్రవాసులపై సానుకూల ప్రభావం..
యూఏఈలో కొత్తగా అమలుకానున్న ఆర్థిక సంస్కరణలతో అక్కడ ఉపాధి పొందుతున్న వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. యూఏఈలో మన రాష్ట్రానికి చెందిన కార్మికులు సుమారు 4లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మరో 4లక్షల మంది ఉన్నారు. వీరంతా ఆ దేశ నిబంధనల మేరకు పన్నులు చెల్లిస్తున్నారు. అలాంటి వారికి ఆ దేశం అమలు చేయనున్న ఆర్థిక సంస్కరణలతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవలే నైపుణ్యం కలిగిన కార్మికులకు మెరుగైన వేతనాలు ఇవ్వాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. యూఏఈలో అమలులో ఉన్న 1500 రకాల సేవల పన్నులను సంస్కరించడం ఆ దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రవాసులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు