డల్లాస్లో 'తెలంగాణలో మారుతున్న సందర్బాలు'

23 Feb, 2018 13:28 IST|Sakshi

డల్లాస్ : 'తెలంగాణలో మారుతున్న సందర్బాలు' అనే అంశంపై తెలంగాణ విద్యావంతుల వేదిక అమెరికాలోని డల్లాస్లో సమావేశాన్ని నిర్వహించనుంది. ఫిబ్రవరి 25న సాయంత్రం 4 గంటలకు మినర్వ హాలులో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం,అర్విని రాజేంద్రబాబులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అన్ని సామాజికవర్గాలకు  రాజ్యాధికారంలో సమన్యాయం ఎందుకు దక్కటం లేదనే అంశంపైన చర్చ ఉంటుందని తెలంగాణ విద్యావంతుల వేదిక సభ్యులు డా. కిరణ్ దాసరి, డా. మహ్మద్ జమీల్, రాయదాస్, సాజీ గోపాల్ తెలిపారు. ప్రజాస్వామిక హక్కులతో రాజ్యాంగపాలన సాగుతున్నదా? తెరాస పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ఎంతవరకు నెరవేర్చింది అనే కోణంలో చర్చ కొనసాగనుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్నారు. దళిత, ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం రక్షణ కలిగిస్తున్నదా? తెలంగాణ యువతకు కొలువులు, పరిశ్రమలు ఏర్పాటు చేయటంలో సర్కారు ఎంత వరకు సఫలమైంది అనే విషయాలపై తెలంగాణ విద్యావంతుల వేదిక చర్చించనుందని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలు సాకారం కాని సందర్భంలో, ప్రజల ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి, ప్రభుత్వ వైఫల్యాలను  నిలదీసి ప్రశ్నించవలసిన బలమైన ప్రతిపక్షం లేని తెలంగాణలో ప్రజలు ఏం చేయాలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక తెలిపింది. తెలంగాణ బాపు  జయశంకర్, కాళోజి నారాయణరావు, బియ్యాల జనార్ధనరావు కలలుగన్న ప్రజాతెలంగాణ, పౌరహక్కులు, ప్రజాస్వామిక అభివృద్ది, రాజ్యాధికారంలో దళిత, బహుజన, ముస్లింలకు సమభాగంతో దక్కే  ప్రజాతెలంగాణ, రైతు, రైతులకూలీలు, విద్యార్ధుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజాతెలంగాణకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిద్దామంది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఉత్తర అమెరికా సభకు డల్లాస్లోని తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక కోరింది.

మరిన్ని వార్తలు