సింగపూర్‌లో వినాయకచవితి వేడుకలు

5 Sep, 2019 17:19 IST|Sakshi

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయకచవితి పూజావేడుకలను పిజిపి హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది స్థానిక తెలుగువారు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు బాల గణపతి పూజను అద్భుతంగా చేశారు. చిట్టి చేతులతో చేసిన బాల గణపతి పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. కార్యక్రమం అంతా, ప్రత్యేకించి మండప అలంకరణను ప్రకృతి పరిరక్షణ చైతన్యానికి ప్రేరణనిచ్చేదిగా రూపొందించారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.

ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ, సుమారు 800 మందికి పైగా తెలుగు సమాజ సభ్యులకు 21 రకాల పత్రిని, ప్రత్యేకంగా రూపొందించిన వినాయక వ్రతకల్పాన్ని ఉచితంగా అందించామని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు వినయ్ మాట్లాడుతూ అందరికీ మంచిజరగాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంకావడానికి చాలామంది సహాయసహకారాలనందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు, దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పూజలో పాల్గొన్న పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు