గీతం మూర్తికి డల్లాస్‌లో ఘననివాళి

6 Oct, 2018 19:39 IST|Sakshi

డల్లాస్‌ (టెక్సాస్) : ‘గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం’ (గానం) ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన సంతాప సభలో ఇటీవల అమెరికాలో మరణించిన గీతం విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, గీతం పాలక మండలి సభ్యులు వెలువోలు బసవపున్నయ్య, గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో అధికారిగా పని చేస్తున్న వి. పి. ఆర్ చౌదరి (చిన్నా), గీతం విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు వీరమాచినేని శివ ప్రసాద్‌లకు ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు.

గీతం విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్‌లో పని చేస్తున్న ప్రొఫెసర్ ఆనంద్ పుప్పాల తన విద్యార్థి జీవితాన్ని నెమరవేసుకుంటూ గీతం తన భవిష్యత్తుకి చక్కని మార్గాన్ని చూపిందని, తాను ఇప్పుడు అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దే అవకాశం కల్పించిందని, ప్రత్యేకంగా తనకు ఎం.వి.వి.ఎస్ మూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

గీతం విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్ధులు ప్రసాద్ రెడ్డి గుజ్జు, చినసత్యం వీర్నపు మాట్లాడుతూ గీతం వల్లే ఈ రోజు తమలాంటి వేలాది మంది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, చదువు చెప్పిన గీతం విశ్వవిద్యాలయానికి, దాన్ని స్థాపించిన డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి జీవితాంతం ఋణపడి ఉంటామని పేర్కొన్నారు. 

25 సంవత్సరాలకు పైగా తాను చేస్తున్న నిస్వార్ధ సేవకు గుర్తింపుగా గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి ప్రవాస భారతీయుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎం.వి.వి.ఎస్ మూర్తి పారిశ్రామిక వేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహిoచినప్పటికీ విద్యావేత్త గానే ఆయన ఎక్కువగా గుర్తింపు పొందడం, విద్య పై ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో గీతం విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యావ్యవస్థగా మూర్తి తీర్చిదిద్దిన తీరు ఆదర్శప్రాయమన్నారు. ప్రతి సంవత్సరం ఇరవై రెండు వేల మంది విద్యార్థులు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో విద్యాభ్యాసం చేయడం గొప్ప విషయం అన్నారు. అంతే గాక ప్రతి సంవత్సరం అనేక వందల మంది విద్యార్థులు గీతం విశ్వవిద్యాలయం నుండి దేశ, విదేశాలల్లో కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. ఒక గొప్ప మానవతావాదిని, దార్శనికుడిని కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తీరని లోటు అని తోటకూర ప్రసాద్ తెలిపారు. అలస్కా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కడియాల వెంకటరత్నం (గాంధీ) త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఇంకా ఈ సంతాప సభలో డాక్టర్. ఉరిమిండి నరసింహా రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శేషారావు బొడ్డు, విజయమోహన్ కాకర్ల మొదలైన వారు తమ ప్రసంగాల్లో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరిన్ని వార్తలు