తలసేమియా నివారణకు గ్లోబల్‌ సంస్థ కృషి

9 Dec, 2019 14:30 IST|Sakshi

చికాగో: ప్రపంచం ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం (డిసెంబర్‌ 1) సందర్భంగా.. తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధులను నివారించటం కోసం అమెరికాకు చెందిన గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ అలయన్స్‌ సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. చికాగోలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ అలయన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించటం కోసం విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్‌ వ్యాధి రూపుమాపడానికి ‘ఎండ్‌తాల్‌నౌ’ పనిచేస్తోందని విజయ్‌ ప్రభాకర్‌ తెలిపారు. ‘ఎండ్‌తాల్‌నౌ’ అంటే తలసేమియాను అంతమొందించడమే అని ఆయన పేర్కొన్నారు. ఇక తలసేమియా వ్యాధిని నివారించడానికి సహదేవ్‌ పౌండేషన్‌ విరాళాలు సేకరించిందని ‘ఎండ్‌తాల్‌నౌ’ సహ వ్యవస్థాపకుడు ప్రదీప్‌ కండిమల్లా కొనియాడారు. తలసేమియా వ్యాధిని నివారించడానికి 10,000 మంది రక్త దానం చేశారని పేర్కొన్నారు. భారీ ఎత్తున రక్తదానం చేయటంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు లభించిందని ఆయన వెల్లడించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ నర్మదా కుప్పుస్వామి మాట్లాడుతూ.. సికిల్‌ సెల్‌ వ్యాధిని అంతమొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులు పదేళ్లు కూడా బతకలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమిరేట్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రకాశం టాటా మాట్లాడుతూ.. ‘ఎండ్‌తాల్‌నౌ’ చేస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులను రక్షించడమే ‘ఎండ్‌తాల్‌నౌ’ లక్ష్యమన్నారు. 

ఇక గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ అలయన్స్‌ (జీఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. జీఎస్‌ఏ ప్రతి ఏడాది డిసెంబర్‌ 1న తలసేమియా వ్యాధి నివారించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం‍లో ప్రముఖ తెలుగు సంగీత గాయకులు ప్రవీణ్‌ జలగామ, ఆయన తనయుడు శిశిర్‌ రాఘవ జలగామ తమ సంగీతం ద్వారా తలసేమియా వ్యాధి నివారించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని  అశోక్‌ పగడాలా నిర్వహించగా.. స్వదేశ్‌ మీడియాకు చెందిన ఉగందర్‌ నగేష్‌, సాయి రవిసురుబొట్ల, చార్లెస్‌ రూటెన్‌బర్గ్‌ రియాల్టీ ఆఫ్‌ సొల్యూషన్స్‌, ప్రొఫెషనల్‌ మోర్ట్‌గేజ్‌ సొల్యూషన్స్, అశోక్‌ లక్ష్మణన్‌, సంతిగ్రమ్‌ కేరళ ఆయుర్వేద నేపర్‌విల్లే, డాక్టర్‌ సుద్దేశ్వర్‌ గుబ్బా, అనికా దుబేలు స్పాన్సర్లుగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు