గల్ఫ్‌లోనూ.. ఎన్నికల వేడి

5 Apr, 2019 12:13 IST|Sakshi

పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రవాసుల ప్రయత్నం

ఆరు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్న వలస జీవులు

సోషల్‌ మీడియా వేదికగా విస్తృత ప్రచారం లేబర్‌ క్యాంపుల్లో జోరుగా చర్చలు

ఎవరికి ఓటు వేయాలనే అంశంపై కుటుంబ సభ్యులకు ఫోన్‌లలో సూచన

సాక్షి, నెట్‌వర్క్‌: మన పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం గల్ఫ్‌ దేశాల్లోనూ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయడానికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్న ప్రవాసులు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తమ డిమాండ్ల సాధనకు ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకున్న గల్ఫ్‌ ప్రవాసులు సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గాలు ఆయా గల్ఫ్‌ దేశాల్లో కూడా ఉన్నాయి. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎవరికి మద్దతును ఇవ్వాలి అనే ఆంశంపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. తమకు ప్రయోజనం కల్పించే ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని గల్ఫ్‌ ప్రవాసులు కొంత కాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న రోజుల్లో స్పందించి ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించి తమ సంక్షేమానికి బాటలు వేస్తాయని వారు భావిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో దాదాపు 13లక్షల మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిపై స్వదేశంలో ఆధారపడిన వారి సంఖ్య నాలుగింతలు ఉంటుంది. గల్ఫ్‌ వలస జీవుల కుటుంబాల సంఖ్యను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది.

ఆరు పార్లమెంట్‌నియోజకవర్గాల్లోప్రభావం చూపే అవకాశం  
గల్ఫ్‌ ప్రవాసుల ప్రభావం ఆరు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. వారి నిర్ణయం ఈ నియోజకవర్గాల్లో కీలకం కానుంది. ఆయా దేశాల్లో పనులు ముగిసిన తరువాత క్యాంపులకు చేరుకుంటున్న వలస కార్మికులు సమావేశాలను నిర్వహిస్తూ తమ డిమాండ్లను రాజకీయ పక్షాలకు తెలిసేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గల్ఫ్‌ ప్రవాసుల సంక్షేమానికి అండగా నిలచే రాజకీయ పక్షాలనే ఆదరించే దిశగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అడుగులు వేస్తున్నారు.

1,122 మంది ఎన్నారై ఓటర్లు
తెలంగాణ రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఓటర్లున్నారు. గల్ఫ్‌ దేశాలలో 13 లక్షల మంది, ఇతర దేశాలలో మరో 10 లక్షల  మంది ప్రవాసులున్నారు. వీరిలో కేవలం 1,122 మంది మాత్రమే ఎన్నారై ఓటర్లు (ఓవర్సీస్‌ ఎలక్టర్స్‌)గా నమోదయ్యారు.

ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకురావాలి  
ప్రవాసులకు ప్రయోజనం కలిగించే ఎన్‌ఆర్‌ఐ పాలసీని తెలంగాణలో తీసుకురావాలి. ఈ పాలసీ వల్ల గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ఎన్నికల సందర్భంగా గల్ఫ్‌ ప్రవాసుల తరఫున మేము కోరుతున్నది ఒక్కటే.. ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలి. ఎన్‌ఆర్‌ఐ పాలసీకి అండగా ఉండేవారికే గల్ఫ్‌ ప్రవాసులు ఎన్నికల్లో మద్దతు తెలిపే అవకాశం ఉంది.      – గోపాల్‌రెడ్డి, బహ్రెయిన్‌

సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం
భారత పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గల్ఫ్‌లో ఉన్న కార్మికులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్‌ తదితర సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఎన్నికలు ముగిసేవరకు గల్ఫ్‌ దేశాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ పార్టీ గెలుస్తుందోనని సమాచారం తెలుసుకుంటున్నారు.     – నర్సారెడ్డి, ఖతార్‌ 

కుటుంబ సభ్యులకు చెబుతున్నాం..
మొన్నటి వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఇక్కడ చర్చ జరిగింది. ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా దేశ భవిష్యత్తుకు సంబంధించిన పార్లమెంట్‌ ఎన్నికలు కావడంతో ఇప్పుడు  వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీల కార్యవర్గాలు కువైట్‌లో ఉన్నాయి. అందువల్ల క్యాంపుల్లో జోరుగానే ప్రచారం జరుగుతోంది. మేము ఓటు వేసే అవకాశాన్ని పొందకపోయినా సొంత గ్రామాల్లో ఉన్న మా కుటుంబ సభ్యులకు ఫోన్లలో ఏ పార్టీకి ఓటు వేయాలో చెబుతున్నాం.–ఆనందం గంగేశ్వర్, కువైట్‌  

దేశభద్రత ముఖ్యం  
నాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి. నేను షార్జాలో ఉంటాను. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశానికి సంబంధించినవి. దేశ భద్రత ఎంతో ముఖ్యం. మన దేశంలో జరిగే ఎన్నికలపై నిత్యం ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇండియాలో మాదిరిగా ఇక్కడ పెద్దగా ప్రచారం ఉండదు కానీ.. ఇండియా వాళ్లు ఎవరు కలిసినా రాజకీయాలపై చర్చ జరుగుతుంది.     – ఆకునూరి శంకర్, షార్జా

దుబాయిలోనూ ఇదే చర్చ  
ఇండియాలో జరుగుతున్న ఎన్నికలపై దుబాయిలోనూ చర్చ సాగుతోంది. ఎవరికి ఓటు వేయాలనే అంశంపై క్యాంపుల్లో కార్మికులు చర్చింకుంటున్నారు. తాము ఇండియాకు వచ్చి ఓటు వేయలేకపోయినా.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి నచ్చిన పార్టీకి ఓటు వేయించే అవకాశం ఉంది. దీంతో కార్మికులు తీరిక సమయాల్లో రాజకీయ చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.    – షేక్‌ మిట్లు, దుబాయి  

మార్పు రావాలని ఆకాంక్ష
దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే.. అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు జాతీయ పార్టీల పాలన చూశాం. కూటమి అధికారంలో వస్తే బాగుంటుందని కార్మికులు చర్చింకుంటున్నారు.
– నంగి మహేందర్, మస్కట్‌

నిజామాబాద్‌ బరిలోగల్ఫ్‌ రిటర్నీలు
నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న సాగుచేసే రైతులు తమ సమస్యలను ప్రభుత్వాలు గుర్తించాలని జాతీయ స్థాయిలో ఈ ఆంశంపై చర్చ జరుగాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 175 మంది రైతులు ఉన్నారు. ఈ రైతుల్లో పలువురు గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతోనే గల్ఫ్‌కు వలస వెళ్లామని, కానీ అక్కడ ఏజెంట్ల మోసాలు, కంపెనీ యజమానుల వంచన వల్ల శ్రమ దోపిడీకి గురయ్యామని పలువురు ఎంపీ అభ్యర్థులు వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన దాదాపు 50 మంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లి వచ్చిన వారు ఉన్నారు.

నేను మొదట గల్ఫ్‌ బాధితుడినే..
నేను మొదట గల్ఫ్‌ బాధితుడినే. అఫ్గానిస్తాన్‌కు వెళ్లి జైలు శిక్ష అనుభవించాను. గల్ఫ్‌ దేశాల్లో ప్రయోజనం లేదని భావించి ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాను. కానీ, వ్యవసాయం కూడా లాభసాటిగా లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వం మా బాధలను గుర్తించి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఎన్నికల బరిలో ఉన్నాం. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిజామాబాద్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నాను.– కుంట కిషన్, ఎంపీ అభ్యర్థి

అక్కడా.. ఇక్కడా ఇబ్బందులే...
నేను దాదాపు పదిహేనేళ్లు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లాను. అక్కడ కష్టాలు ఎదుర్కొన్నాను. ఇక్కడకు వచ్చి వ్యవసాయం చేస్తే పసుపు పంటకు, ఎర్రజొన్నలకు ధర లేక నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాలని పోటీలో నిలిచాం. ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకుంటే మా బతుకులు బాగుపడతాయి.– లక్ష్మణ్, ఎంపీ అభ్యర్థి, జక్రాన్‌పల్లి
 
గల్ఫ్‌ కార్మికులకు న్యాయం చేయాలి
గల్ఫ్‌ కార్మికులకు, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇక్కడ వ్యవసాయం బాగాలేదని గల్ఫ్‌కు వెళ్తే అక్కడ కూడా పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఎంతో మంది గల్ఫ్‌ కార్మికులు కష్టాలు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు గల్ఫ్‌ కార్మికులకు, రైతులకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి.– భావన్న, ఎంపీ అభ్యర్థి, జక్రాన్‌పల్లి

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు