నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రిన్సిపల్‌ లయజన్‌గా హరిప్రసాద్‌రెడ్డి

28 Feb, 2020 19:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రానికి ఉత్తర అమెరికా నుంచి పెట్టుబడులు వచ్చేలా కృషి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రిన్సిపల్‌ లయజన్‌గా లింగాల హరిప్రసాద్‌రెడ్డిని నియమించింది. ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఏపీలో స్థానికులకు ఉపాధి కల్పించే బాధ్యతలను హరిప్రసాద్‌రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి, పెట్టుబడిదారులకు మధ్య హరిప్రసాద్‌రెడ్డి వారధిలా కృషి చేస్తారని తెలిపారు. 

అనంతపురం జిల్లాకు చెందిన లింగాల హరిప్రసాద్‌రెడ్డి చాలా కాలం కింద అమెరికా వెళ్లి డెట్రాయిట్‌లో స్థిరపడ్డారు. 2014 నుంచి అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌ సభ్యులుగా ఉన్న హరిప్రసాద్‌ రెడ్డి వేర్వేరు కంపెనీల్లో  పలు హోదాల్లో పని చేశారు. గల్ఫ్‌ దేశం ఒమన్‌తో పాటు ఆఫ్రికాలోని పలు మైనింగ్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే హరిప్రసాద్‌రెడ్డికి పలు కంపెనీలతో మంచి సంబంధాలున్నాయి. ఆయన అనుభవం, ప్రజా సంబంధాల దృష్ట్యా హరిప్రసాద్‌ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రిన్సిపల్‌ లయజన్‌ అధికారిగా నియమించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతల పట్ల లింగాల హరిప్రసాద్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు