ఎన్నారై యువకుడి దారుణహత్య

19 Jul, 2018 15:33 IST|Sakshi
హత్యకు గురైన పల్విందర్‌ సింగ్‌ (పాత చిత్రం)

టొరంటో : భారత సంతతికి చెందిన 27 ఏళ్ల యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలో స్వగృహంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది బ్రాంప్టన్‌లో చోటుచేసుకున్న 11వ హత్య అని.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందంటూ వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శరత్‌ కొప్పు(25) హత్యకు గరైన విషయం తెలిసిందే. ఆపై పరారీలో ఉన్న నిందితుడ్ని అమెరికా పోలీసులు కాల్చిచంపారు.

పోలీసుల కథనం ప్రకారం.. భారత్‌కు చెందిన పల్విందర్‌ సింగ్‌ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్‌ నగరంలో నివాసం ఉంటున్న పల్విందర్‌  ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నలుగురు గుర్తుతెలియని దుండగులు పల్విందర్‌ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి అతడు మృతిచెందాడు. ఈ హత్యకేసులో నిందితులైన మిస్సిస్సౌగాకు చెందిన 18, 19 ఏళ్ల యువకులిద్దరూ లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. 

‘మరో రెండు రోజుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన నా మిత్రుడు ఇకలేడు. ఇక బర్త్‌డే పార్టీ ఎవరు చేసుకుంటారు మిత్రమా. నువ్వు బతికుండాల్సిన వాడివి’ అంటూ పల్విందర్‌ స్నేహితుడొకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. గన్‌ కల్చర్‌ కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మేయర్‌ లిండా జెఫ్రీకి ఫిర్యాదు చేశారు.

 

మరిన్ని వార్తలు