రెస్టారెంట్‌ ధ్వంసం.. విద్వేషపూరిత రాతలు

24 Jun, 2020 11:49 IST|Sakshi

వాషింగ్టన్‌: న్యూ మెక్సికోలోని సాంటే ఫే నగరంలో ఒక భారతీయ రెస్టారెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. రెస్టారెంట్‌ గోడల మీద విద్వేషపూరిత సందేశాలను రాశారు. ఇండియా ప్యాలెస్ అనే ఈ రెస్టారెంట్‌ ఓ సిక్కు వ్యక్తిది అని స్థానిక మీడియా తెలిపింది. రెస్టారెంట్‌కు జరిగిన నష్టం 1,00,000 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ సంఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్‌ఏఎల్‌డీఈఎఫ్- సాల్డెఫ్‌‌) తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని సాల్డెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ గిల్ అన్నారు. అంతేకాక శాంటా ఫే ఒక ప్రశాంతమైన పట్టణం అని.. సిక్కు సమాజం గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో యజమాని మాట్లాడుతూ.. ‘దుండగులు రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ని విరగ్గొట్టారు. గాజు సామానును ముక్కలు ముక్కలు చేశారు. వైన్‌ ర్యాక్‌ను ఖాళీ చేశారు. ఓ దేవత విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వంటగదిని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆహారాన్ని వేడి చేసే పరికరాలు ధ్వంసం చేశారు. గోడల మీద ‘వైట​ పవర్’‌.. ‘ట్రంప్‌2020’.. ‘ఇంటికి వెళ్లు’ అని రాసి ఉంది. ఇవన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. దీని గురించి స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలో భాగంగా స్పానిష్ వలసవాదులతో సంబంధం ఉన్న విగ్రహాలను తొలగించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్‌ 20న కొలరాడోలోని లాక్‌వుడ్‌లో ఎరిక్ బ్రీమాన్‌ అనే వ్యక్తి.. సిక్కు అమెరికన్ లఖ్వంత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశాడు. నాటి నుంచి ఈ ద్వేషపూరిత నేరాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని సాల్డెఫ్ తెలిపింది. లఖ్వంత్ సింగ్‌పై దాడి చేస్తున్నప్పుడు సదరు వ్యక్తి.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని బెదిరించాడని తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

మరిన్ని వార్తలు