డల్లాస్‌లో ‘ఘన’తంత్ర వేడుకలు

27 Jan, 2018 22:20 IST|Sakshi
ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

డల్లాస్‌ : భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్తర టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డల్లాస్‌లోని భారతీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా నగరం నడిబొడ్డున గాంధీ మెమోరియల్‌ స్వప్నం సాకారానికి కృషి చేసిన వారందరిని ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ సెక్రటరీ రావు కల్వల కొనియాడారు. గణతంత్ర  వేడుకకు వచ్చిన వారందరికీ స్వాగతం పలికి, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రసాద్‌ తోట కూర భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్‌, క్రైస్తవులకు బైబిల్‌ అంటూ ప్రతి మతానికి ఓ గ్రంథం ఉందని, కానీ భారత పౌరులందరికి కలిపి ఒకే గ్రంథం ఉందని అది రాజ్యాంగమని తెలిపారు. ఈ పవిత్ర గంథం పౌరుల సూత్రాలు, విధానాలు, అధికారాలు, విధులు, బాధ్యతలు మరియు ప్రాథమిక హక్కులను నిర్వచిస్తుందన్నారు. రాజ్యాంగమే సుప్రీమని, ప్రతి పౌరుడు రాజ్యాంగం యొక్క విలువలను అర్ధం చేసుకోని అనుసరించాలన్నారు. రాజ్యాంగాన్ని రూపోందించిన డాక్టర్‌ అంబేడ్కర్‌, జవహార్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యాం ప్రసాద్ ముఖర్జీలను గుర్తించుకోవాలన్నారు. వీరంతా మూడేళ్లపాటు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపోందించారని తెలిపారు.

గాంధీ విగ్రహానికి ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ డైరెక్టర్‌ కమల్‌ కౌశల్  పూల మాల వేసి నివాళులు అర్పించారు. మరో డైరెక్టర్‌ షబ్నమ్‌ మోడ్గిల్ గాంధీ వర్థంతిని పురస్కరించుకొని జనవరి 30న అందరం మళ్లీ కలుసుకుని మహాత్ముడికి నివాళులు అర్పిద్దామని పేర్కొన్నారు. ఈ వేడుకలకు అమెరికాలోని భారత పౌరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు