ఘనంగా ముగిసిన 'లాటా' మిని ఒలింపిక్స్‌

30 Jul, 2018 09:56 IST|Sakshi

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికాలో లాస్‌ఏంజెల్స్‌ తెలుగు అసోసియేషన్‌(లాటా)  నిర్వహించిన మినీ ఒలింపిక్స్‌ ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2016 ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ యాష్లీ జాన్సన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు మెడల్స్‌, ట్రోపీలను అందజేశారు. స్థానిక కళాకారులు శ్రీమాన్‌ కొమరగిరి, రమ్య పుచ్చలు తమ ఆటాపాటలతో అతిథులను ఉర్రూతలూగించారు.

ఎనిమిది క్రీడా పోటీల్లో ఆరు చోట్ల లీగ్‌ మ్యాచ్‌లు, ప్రతీ ఆటకూ ఫైనల్స్‌తో కలిపి 6 వారాలపాటూ ఈ పోటీలను నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ దాదాపు 1100 మంది క్రీడాకారులు ఈ మినీ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఓ తెలుగు సంస్థ ఇంత పెద్ద క్రీడాపోటీలను నిర్వహించడం అమెరికాలో ఇదే తొలిసారి అని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వారు తెలిపారు. మే 26న మొదలైన ఈ క్రీడాపోటీలు జూలై 1న క్రికెట్‌ ఫైనల్స్‌తో ముగిశాయి. క్రికెట్‌, వాలీబాల్‌, టెన్నిస్‌, టెన్నికాయిట్‌, చెస్‌, క్యారంస్‌, స్విమ్మింగ్‌, రన్నింగ్‌ క్రీడలను ఇర్వైన్‌, ఈస్ట్‌ వెల్‌, వాలెన్సియా, టోరెంస్‌, సైప్రస్‌, బర్‌ బ్యాంకు, బ్యుయనా పార్క్‌, ఆర్కేడియా నగరాల్లో నిర్వహించారు. 145 మంది లాటా కార్యకర్తలు ఈ పోటీలను పర్యవేక్షించారు. 

యాష్లీ జాన్సన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆటల్లో, చదువుల్లో, జీవితంలో అయినా చిన్న చిన్న లక్ష్యాలని సాధించడం ద్వారా ఎంత పెద్ద లక్ష్యం అయినా ఛేదించవచ్చు అని తాను ఒలింపిక్స్‌లో బంగారు పథకం ఎలా సాధించారో వివరించారు. మినీ ఒలింపిక్స్‌ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ కృతజ్ఞలు తెలిపారు. అతి తక్కువ ఫీజుతో ఆగష్టు 4, 5 తేదీల్లో స్క్రమ్‌ సర్టిఫికేషన్‌ ట్రైనింగ్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు కోసం latausa.org వెబ్‌సైట్‌ను సందర్శంచాలని కోరారు.   

మరిన్ని వార్తలు