ఆర్టీసీ కార్మికులకు లండన్‌లో ఎన్‌ఆర్‌ఐల మద్దతు

11 Nov, 2019 20:44 IST|Sakshi

లండన్‌ : ఆర్టీసీ కార్మికులకు యూకే (లండన్) తెలంగాణా ఐక్య వేదిక అఖిలపక్షం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. లండన్‌లోని కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, తెలంగాణ జనసమితి, టీడీపీ, జనసేన అభిమానులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండ రాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ మంత్రి డీకే  అరుణ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి వారి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చారు. లండన్ తరహాలో అన్ని దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. 

ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్‌ఆర్‌ఐల మద్దతు స్ఫూర్తితో మిగిలిన దేశాల్లో నివసిస్తున్నవారు మద్దతు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణలో కష్ట కాలంలో మౌనం వహించడం తప్పన్నారు. సామాజిక బాధ్యతతో ఎన్‌ఆర్‌ఐలు తమ అభిప్రాయాలను చెప్పి ప్రభుత్వం పరిష్కారం తీసుకునేలా చొరవ తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కోరారు. 

నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. లండన్ తరహాలో అమెరికాలో కూడా ఎన్‌ఆర్‌ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి  డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, ఉద్యమ అణచివేతలు, మరో సమస్యకి దారితీస్తాయని తెలిపారు.హైకోర్టుని కూడా తప్పు దోవ పట్టించే అవసరం లేదని, ముఖ్యమంత్రి మొండి వైఖరి విడనాడాలని సూచించారు. 

ముఖ్యమంత్రి పెద్ద మనుసు చేసుకొని కార్మికుల సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలనీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. పట్టు విడుపుల సమయం కాదని బలిదానాలు పెరగకుండా చర్యలు చేపట్టాలని, అణిచివేత ధోరణితో సమస్య పరిష్కారం కాదని అన్నారు. థేమ్స్ నది ఒడ్డున లండన్‌లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్నారైలు, ఆర్టీసీ కార్మికుల పక్షాన మద్దతు తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తమ సమస్యకి విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు.


తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో పాల్గొన్న గంప వేణుగోపాల్, పసునూరి కిరణ్, రంగు వెంకటేశ్వర్లు, శ్రీధర్ నీలల ఆధ్వర్యంలో 6 ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరపున గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ నీలా, శ్రీనివాస్ దేవులపల్లి, నర్సింహా రెడ్డి తిరుపరి, మేరీ, జవహార్ రెడ్డి, జయంత్ వద్దిరాజులు, బీజేపీ పార్టీ తరపున పసునూరి కిరణ్, ప్రవీణ్ బిట్లలు, తెలంగాణ జన సమితి పార్టీ తరపున రంగు వెంకటేశ్వర్లు, స్వామి ఆకుల, రాజు గౌడ్‌లు, టీడీపీ పార్టీ తరపున కోటి, చైతన్యలు, జనసేన పార్టీ తరపున అయ్యప్ప, హనీఫ్, అబ్దుల్ లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు శివా రెడ్డి, గణేష్ రెడ్డిలు, యూకే  తెలంగాణ మేధావి వర్గం నుండి ఓరుగంటి కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, డాక్టర్ విశ్వనాథ్‌ కొక్కొండలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు