అమెరికాలో ఘనంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం

21 May, 2019 11:24 IST|Sakshi

కాలిఫోర్నియా : అమెరికా, స్కాట్లండ్, కెనడా దేశాలలోని 50కి పైగా కేంద్రాలలో మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పరీక్షలకు 2230 మంది విద్యార్ధులు హజరు కాగా దానిలో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియా, లాస్ ఎంజెలెస్‌, డాలస్‌లలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్ వి సత్యనారాయణ చేతులమీదుగా విద్యార్ధులు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
 

ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, పుట్టిన దేశానికి ఎంతో దూరంగా ఉన్నా మాతృభాషపై మమకారంతో తెలుగు భాషను పిల్లలకు నేర్పిస్తున్న తల్లితండ్రులకు, వారికి శిక్షణనిస్తున్న గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలలో దాదాపుగా 45,000 మందికి పైగా విద్యార్ధులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని, అమెరికా వ్యాప్తంగా 250 పైగా కేంద్రాల ద్వారా మనబడి తరగతులు నిర్వహిస్తునామని తెలిపారు. 2019-2020 విద్యాసంవత్సరానికి నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

సిలికానాంధ్ర సంపద ద్వారా తెలుగు విశ్వవిద్యాలయం వారు కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సులలో నిర్వహించే జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన 333 మంది విద్యార్ధులకు కూడా ఈ కార్యక్రమంలో ధృవీకరణ పత్రాలను అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయ అధికారులు డా. గాబ్రియెల్, డా. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంపద కొసం రూపకల్పన చేసిన నూతన లోగోను, మనబడి బాలరంజని మొబైల్ అప్లికెషన్, ప్రముఖ రచయిత అనంత్ శ్రీరాం రచించిన మనబడి గీతాన్ని కూడా తెలుగు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మన సంస్కృతి పట్టుగొమ్మలైన భారతీయ కళలను రేపటి తరానికి అందించే దిశగా సిలికానాంధ్ర సంపద కృషి చేస్తోందని, మొదటి సంవత్సరమే దాదాపుగా 1400 మందికి పైగా విద్యార్ధులు, 150 మందికిపైగా సంగీత నృత్య గురువులు నమోదు చేసుకోవడం, భారతీయ కళల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనడానికి నిదర్శనమని సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల అన్నారు.


మనబడి, సంపద స్నాతకోత్సవ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ మాతృదేశాన్ని, మాతృ భాషని మర్చిపోలేమని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళలు ఎంతో ఉత్కృష్టమైనవి, ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శప్రాయమైనవి కాబట్టే మనబడి ద్వారా తెలుగు భాషని, సిలికానాంధ్ర సంపద ద్వారా భారతీయ కళలని ప్రవాస బాలలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని,  ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండ, ఉష మాడభూషి, స్నేహ వేదుల, జయంతి కోట్ని, మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు