రాలిన ఆశలు

26 Jul, 2019 09:01 IST|Sakshi
విలపిస్తున్న మల్లేశ్‌ భార్య, కుమారులు

కుటుంబాలకు అండగా ఉండాల్సినవారు కానరాని లోకాలకు..

ఉపాధి కోసం సౌదీకి వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

ఆధారం కోల్పోయిన కుటుంబ సభ్యులు  

మృతదేహాల రాక కోసం ఎదురుచూపు

ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి

ఎడారి దేశంలో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిన ఆ వ్యక్తి తన ఆశలు నెరవేరకుండానే కానరాని లోకాలకు వెళ్లాడు. గంట ముందు ఫోన్‌లో తనతో మాట్లాడి బాగున్నావా.. కొడుకులను మంచిగా చదివించు నేను దసరాకు వస్తా అని చెప్పిన భర్త.. ఇక శాశ్వతంగా రాడని తెలిసి భార్య తల్లడిల్లుతోంది. కుటుంబాన్ని పోషించాల్సిన   పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అనాథ అయింది. 

అమరగొండ సతీష్‌గౌడ్, జన్నారం : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన ఉప్పు మల్లేశ్‌(42) తనకున్న ఎకరం భూమిని సాగుచేసుకోవడంతో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య భాగ్య, కుమారులు రాకేశ్, వినయ్‌ ఉన్నారు. కొంతకాలం క్రితం భార్య అనారోగ్యం బారిన పడగా చికిత్స కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. గ్రామంలో ఉండి పనులు చేస్తే పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు డబ్బులు సరిపోవడం లేదని మెరుగైన ఉపాధి కోసం 2016 సెప్టెంబర్‌ 11న సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అందుకు రూ.1.50 లక్షలు అప్పు చేసి ఓ ఏజెంట్‌కు చెల్లించాడు. అయితే, మల్లేష్‌ అక్కడ మూడు సంవత్సరాలు పనిచేసినా అప్పులు తీర్చలేకపోయాడు. అడపా దడపా డబ్బులు ఇంటికి పంపినా కుటుంబ పోషణకే సరిపోయాయి. కాగా, ఈనెల 21న తన స్నేహితుడు దండెపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సౌదీ రాజధాని రియాద్‌లో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లేష్‌ మరణంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. ఆయన కుమారులు చదువుకుంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న భార్య పనిచేసే పరిస్థితిలో లేదు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని మల్లేష్‌ భార్య భాగ్య అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకుంటోంది. 

 ఇంటి వద్ద దీనంగా కూర్చున్న రాజు తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు
తల్లిదండ్రుల కష్టాలు చూడలేక.. ఉపాధి కోసం ఊరును వదిలి గల్ఫ్‌ బాట పట్టిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. దీంతో ఆ కుటుంబీకులు అతనిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్నారు. 

మోదంపురం వెంకటేష్, దండేపల్లి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన నాంపల్లి సత్తయ్య, రాజవ్వకు ముగ్గురు సంతానం. వారి కులవృత్తి(రజక)తో   కుటుంబ పోషణ అంతంతమాత్రంగానే సాగుతోంది. అయితే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు పెద్దకుమారుడైన రాజు(24) మూడేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడ కారు డ్రైవింగ్‌ పనిలో కుదిరాడు. రాజుకు సోదరి మౌనిక, సోదరుడు వెంకటేష్‌ ఉన్నారు. తాను సాదీకి నుంచి డబ్బులు పంపిస్తానని, మీరు బాగా చదువుకోండని తన సోదరి, సోదరుడికి చెప్పి వెళ్లాడు. వారి చదువుకు అవసరమయ్యే ఖర్చులకు డబ్బులు పంపించడంతో పాటు, ఇంటి అవసరాలకు కూడా డబ్బులు పంపిస్తున్నాడు. రాజు చెల్లెలు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా.. తమ్ముడు ఇటీవలే బీటెక్‌లో జాయిన్‌ అయ్యాడు.

విధి వక్రించి..
రాజు సౌదీ నుంచి డబ్బులు పంపిస్తుండడంతో ఆ కుటుంబానికి కొండంత అండ దొరికినట్లయింది. కానీ, విధి వక్రించింది. అతను ఈ నెల 21న రియాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తమను ఆదుకుంటాడనుకున్న కుమారుడు విగత జీవిగా ఇంటికి వస్తున్నాడని తెలిసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన తమ సోదరుడు ఇక లేడని తెలిసి.. రాజు తమ్ముడు, చెల్లెలు రోదన చూసిన ప్రజలు కూడా కన్నీటిపర్యంతమవుతున్నారు.

దీపావళికి ఇంటికి వస్తానని..
మూడేళ్ల క్రితం వెళ్లిన రాజు దీపావళి పండుగకు ఇంటికి వచ్చి చెల్లికి పెళ్లి చేసి, తాను కూడా పెళ్లి చేసుకుంటానని ఇటీవల తల్లిదండ్రులకు, స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రతి నిత్యం ఇంట్లో తమతో ఫోన్లో మాట్లాడేవాడని, చనిపోయే రోజు కూడా  మాట్లాడాడని కుటుంబీకులు రోదిస్తూ చెప్పారు. తమ కొడుకును కడసారి చూసేందుకు సౌదీ నుంచి మృతదేహాన్ని త్వరగా స్వ గ్రామానికి తెప్పించాలని, ప్రభుత్వం సహకరించాలని రాజు తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు