పల్లెను మార్చిన వలసలు

13 Sep, 2019 12:29 IST|Sakshi
మన్నెగూడెం గ్రామం

ఎడారి దేశాల్లో 500 మంది వరకు మన్నెగూడ వాసులు

సౌదీలోనే 200 మంది ఉపాధి

గ్రామాభివృద్ధికి వలస జీవుల సహకారం

బాధితుల కుటుంబాలకు చేయూత

ప్రజాప్రతినిధులుగానూ ఎన్నిక

బండ్ల సురేష్, మేడిపల్లి(జగిత్యాల జిల్లా) : జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని మన్నెగూడెం వలస లకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. మెరుగైన ఉపాధి కోసం ఇక్కడి నుంచి యువకులు అత్యధికంగా గల్ఫ్‌కు వెళ్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వారు గల్ఫ్‌లో ప్రస్తుతం 500 మందికి పైగా ఉండడం విశేషం. ఇందులో ఒక్క సౌది అరేబియాలోనే 200 మంది ఉపాధి పొందుతున్నారు. మన్నెగూడెం నుంచి గల్ఫ్‌కు వలసలు 1977 నుంచి ప్రారంభమయ్యాయి. మొదట్లో కొద్ది మంది మాత్రమే ఎడారి దేశాలకు వెళ్లారు. 1985 నుంచి వలసజీవుల సంఖ్య పెరిగింది.   యూఏఈ, ఒమాన్, కువైట్‌తో పాటు సౌదీ అరేబియాకు వెళ్లడం ప్రారంభించారు.  

గ్రామాభివృద్ధిలో వీరే కీలకం..
గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి గల్ఫ్‌లో ఉన్నవారు తోచిన విధంగా సహాయం చేస్తుంటారు. పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నారు. పేదవిద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం, చదువులో ముందంజలో ఉన్నవారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుతో పాటు విద్యా వలంటీర్‌తో బోధన చేయిస్తున్నారు. గ్రామంలో దేవాలయ నిర్మాణానికి కూడా పూనుకున్నారు.

మేమున్నామంటూ భరోసా..
ఐదేళ్ల కాలంలో ఈ గ్రామానికి చెందిన ఐదుగురు గల్ఫ్‌లో వివిధ కారణాలతో మృతిచెందారు. కట్కం శ్రీకాంత్‌ అనే యువకుడు సౌదీలో గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో సౌదీలో ఉన్న శ్రీకాంత్‌ మిత్రులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన తోటి కార్మికులు ఆ కుటుంబానికి రూ.15,59,236 (సౌదీ రియళ్ళు 81,500) అందజేశారు. మరికొందరి  కార్మికుల కుటుంబాలకు కూడా చేయూత ఇచ్చారు. 

ప్రజాప్రతినిధులుగానూ..
ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన వారిలో గల్ఫ్‌కు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ ఉన్నారు. 2013లో గౌరి భూమయ్య సౌదీ నుంచి ఇచ్చి  ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే ఎంపీటీసీగా గెలుపొందిన చెన్నమనేని రవీందర్‌రావు కూడా దుబాయి వెళ్లి వచ్చాడు. ప్రస్తుత సర్పంచ్‌ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి సౌదీ నుంచి వచ్చి ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు.

సౌదీ నుంచి వచ్చి..సర్పంచ్‌గాఎన్నిక..
సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఇక్కడ తీవ్ర కరువు కారణంగా గల్ఫ్‌కు వెళ్లడమే ఉత్తమమని నిర్ణయించుకొన్నాడు. 2007లో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవడం కాకుండా   పది మందికి ఉపాధి చూపించారు. దీంతో పాటు సామాజిక సేవ కూడా అలవర్చుకొని పేదవారికి తనవంతుగా సహాయం చేశారు. 2018లో ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ సంవత్సరం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ప్రజల నమ్మకాన్ని నిలబెడతా..
నేను సౌదీకి మొదట కార్మికుడిగానే వెళ్లాను. 3500 నుంచి 4000 రియాళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఏఆర్‌ఏఎంసీవో(అరేబియన్‌ అమెరికన్‌ కోఆప్షన్‌ కంపెనీ)లో ఉద్యోగంలో చేరా. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. నెలకు ఇండియా కరెన్సీలో రూ.ఐదారు లక్షలకు పైనే సంపాదన ఉండేది. నాతో పాటు నా తమ్ముడిని కూడా సౌదీకి తీసుకువచ్చా. కొందరు మిత్రులము కలిసి సౌదీలో మ్యాన్‌ పవర్‌ సప్లై కంపెనీని ఏర్పాటు చేశాం. మా ఊరి వాళ్ళను, చుట్టు పక్కల గ్రామాల వాళ్లను సౌదీకి తీసుకువచ్చి పనులు కల్పించాం. దాదాపు 11 సంవత్సరాల పాటు సౌదీలోనే పనిచేశా. సామాజిక సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాయం చేశా. మన్నెగూడెం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలకు మినరల్‌ వాటర్‌ ప్లాంటు, మధ్యాహ్న భోజనానికి వంటపాత్రలు, సిలిండర్‌తో పాటు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించా. ప్రాథమిక పాఠశాలలకు ఎల్‌ఈడీ టీవీలతో పాటు కంప్యూటర్లు కొనిచ్చాను.  నేను ఇండియాకు వచ్చేటప్పటికి నా జీతం రూ.15లక్షల పైనే ఉంది.  గ్రామస్తులు, మిత్రులంతా నన్ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఇది గ్రామస్తులు నాకు ఇచ్చిన బహుమతి అనుకుంటున్నా. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవ చేస్తా.

మన్నెగూడెం జనాభా: 3,913
ఓటర్లు: 2827
మొత్తం కుటుంబాలు: 1200
గల్ఫ్‌లో ఉన్న వారు : 500 మంది

మరిన్ని వార్తలు