లండన్లో 'ప్రపంచ తెలుగు మహా సభల' సన్నాహక సదస్సు

18 Nov, 2017 11:42 IST|Sakshi

లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అట్టహాసంగా డిసెంబర్ 15 నుండి19 వరకు నిర్వహించబోతున్న ఐదవ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును నిర్వహించారు.

పవిత్ర రెడ్డి కంది సమన్వయ కర్తగా నిర్వహించిన ఈ సదస్సుకి  ప్రపంచ తెలుగు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ముఖ్య అతిథిగా హాజరై మహాసభల ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ప్రపంచమంతా గుర్తించే విధంగా తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా, తెలంగాణ సాహితీ  వైభవాన్ని చాటేలా సభలు నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ మహాసభలకు వివిధ ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు బాషా అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభల్లో భాగంగా అవధానాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రక్రియలపై సభలు నిర్వహిస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమానికి దేశ విదేశాలలోని తెలుగు బాషా ప్రియులకు ఆహ్వానాలు పంపామని తెలిపారు. ఎల్బీ స్టేడియం ప్రధాన వేదికగా రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఈ సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషా ప్రియులు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన ఈ తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావడం తెలుగు వారంతా స్వాగతించాల్సిన విషయం అన్నారు. అంతే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని ముందు తరాలకు అందించేందుకు, బాషా ఔన్నత్వం మరింతగా కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ఎన్నారైలు గా తాము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అనంతరం జరిగిన చర్చా గోష్ఠిలో మహాసభలకు సంబంధించి తమ సలహాలను, సూచనలను తెలపడంతో పాటు పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చివరగా ఎన్నారై లను మహా సభలల్లో భాగస్వాములను చెయ్యాలని లండన్ వచ్చి ఆహ్వానించిన మహేష్ని ప్రవాస సంఘాల ప్రతినిధులంతా కలిసి శాలువా తో సత్కరించారు. ఈ సదస్సుకు యూకేలో వున్న ప్రవాస సంఘాల (టాక్, జాగృతి యుకె - యూరోప్, టి.డి.ఎఫ్ యుకె, టి.ఎన్.ఎఫ్, తాల్, యుక్తా, జేటీఆర్డీసీ, ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే, ఇతర సంఘాలు)  ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు మేధావులు పాల్గొన్న వారిలో వున్నారు.

మరిన్ని వార్తలు