మన బడికి ప్రతిష్టాత్మక నాటా పురస్కారం

23 Jul, 2018 13:51 IST|Sakshi

కాలిఫోర్నియా : గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి​ ​ఉత్తర అమెరికా తెలుగు సమితి (​నాటా​)​ 'విద్యా  ప్రదాయని' పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా ​మెగా కన్వెన్షన్ వేదిక మీద​ నాటా​ అడ్వయిజరీ ​ ​కౌన్సిల్  ఛైర్మన్ ​ప్రేం కుమార్ రెడ్డి​​, ​ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ​తదుపరి ​అధ్యక్షులు​ ​రాఘవ రెడ్డి ​​తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు​ శరత్ వేట ​​ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ​ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు.​ తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను ​గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాల​కు పైగా​ అమెరికా, కెనడా​లతో పాటు 10 ​ఇతర ​దేశాలలో 35​,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష ​నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్‌సైట్‌ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 'భాషాసేవయే భావితరాల సేవ' అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి ​అహర్నిశలూ కృషి చేస్తుందని​ ​అన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా