విష్ణుప్రియకు సన్మానం

16 Jul, 2018 12:34 IST|Sakshi

న్యూజెర్సీ : కళాభారతి న్యూజెర్సీ ఆధ్వర్యంలో నాటా ఐడల్-2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణుప్రియ కొత్తమాసును ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూజెర్సీలో జరిగిన ఈ  కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర తెలుగు సంఘాల పెద్దలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్  ఫిలడెల్ఫియాలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో విష్ణుప్రియా కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. ఈ వేడుకలకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణుప్రియకు తన తర్వాతి చిత్రంలో గాయనిగా  అవకాశం ఇవ్వనున్నట్లు కళ్యాణ్‌ మాలిక్‌ ప్రకటించారు. అనంతరం అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రముఖులు విజేతను అభినందించారు.

చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ కళాభారతి జరిపిన కార్యక్రమం ఎంతో బాగుందని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటంలో కళాభారతి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, హోలీ, దీపావళి వంటి పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన చిన్నతనం నుంచి పాల్గొంటున్న విష్ణుప్రియ ఈ అవార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని విజయాలను అందుకోవాలని కళాభారతి సభ్యులు, పెద్దలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు అతిథులను అలరించాయి.

మరిన్ని వార్తలు