జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు

25 Jun, 2018 12:24 IST|Sakshi

ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7, 8న నాటా సాహిత్య సమావేశాలు జరుగనున్నాయని నాటా లిటరరీ కమిటీ చైర్మన్ మెట్టుపల్లి జయదేవ్, కో- చైర్ తిమ్మాపురం ప్రకాష్ తెలిపారు. కమిటీ సభ్యులు ఆదినారయణరావు రాయవరపు, శ్రీనివాస్ సోమవారపు, కమిటీ సలహదారులు శరత్ వేట, తిరుపతి రెడ్డిలతో చర్చించి నాటా సాహిత్య సభల షెడ్యూల్‌కు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం నుంచి మీడియా సాహిత్యం వరకూ జరిగే మొత్తం 5 సెషన్లలో ప్రముఖ రచయితలూ, విమర్శకులూ పాల్గొననున్నారు. ప్రతి సెషన్ మధ్యలో స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉండనున్నాయి. 

జూలై 7 శనివారం రెండు సాహిత్య సెషన్లు జరుగుతాయి. మొదటి సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ప్రొఫెసర్ అఫ్సర్ అధ్యక్షతన 'తెలుగు ప్రసార మాధ్యమాల సాహిత్య కృషి' అనే అంశంపైన జరుగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తెలుగు అచ్చు పత్రికలు- సాహిత్యం అనే అంశం మీద ప్రొఫెసర్ అఫ్సర్, అంతర్జాలంలో తెలుగు పత్రికల సాహిత్య కృషి గురించి ప్రముఖ కవి, విమర్శకులు, ఎడిటర్ రవి వీరెల్లి, ఎలక్ట్రానిక్ మీడియా : మన సాహిత్యం అనే అంశం గురించి డాక్టర్ నరసింహ రెడ్డి దొంతి రెడ్డి, తెలుగు సినిమా సాహిత్యం గురించి ప్రసిద్ధ సినిమా కవి వడ్డేపల్లి కృష్ణ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి.

రెండో సెషన్ ౩ గంటల నుంచి  5 గంటల వరకు 'అమెరికా తెలుగు సాహిత్యం - కొత్త ధోరణులు' అనే అంశం మీద జరుగుతుంది. ప్రముఖ కవి, విమర్శకులు నారాయణ స్వామి వెంకట యోగి సభకి అధ్యక్షత వహిస్తారు. నారాయణ స్వామి 'అమెరికా తెలుగు సాహిత్యంలో రూపం సారం' అనే అంశం గురించి మాట్లాడతారు. అమెరికాలో తెలుగు సాహిత్య సంఘాలు చేస్తున్న కృషి, కొత్త తరం సాహిత్య సృష్టిలో ఆ సంఘాల పాత్ర గురించి ప్రసిద్ధ రచయిత, వంగూరి ఫౌండేషన్ చైర్మన్ వంగూరి చిట్టెన్ రాజు ప్రసంగిస్తారు. కెనడా సాహిత్య ప్రముఖులు సరోజా కొమరవోలు అమెరికా తెలుగు రచనల విశ్లేషణ అందిస్తారు. అమెరికాలో తెలుగు కథ: కొత్త ధోరణుల గురించి ప్రసిద్ధ కథకులు శివకుమార్ శర్మ తాడికొండ మాట్లాడతారు. ఈ సెషన్ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి.

జూలై 8 ఆదివారం ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు అవధాని సార్వభౌమ, అవధాని కంఠీరవ నరాల రామారెడ్డి అవధానంతో రెండో రోజు సాహిత్య కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఓ భిన్నమైన అంశం మీద ప్రసంగాలతో రెండో సమావేశం మొదలవుతుంది. కేవలం సాహిత్యం మాత్రమే కాకుండా, ఆ సాహిత్యానికి వెన్నెముక లాంటి భాష, సమాజాలతో సాహిత్యానికి ఉండే సంబంధాల గురించి 'భాష - సాహిత్యం - సమాజం'  సెషన్ ఉంటుంది. ఇందులో సాహిత్యంలో శాస్త్రీయ విలువల గురించి ప్రముఖ హేతువాది నరిశెట్టి ఇన్నయ్య, భారతీయ సాహిత్యంలో తెలుగు భాష స్థానం గురించి ప్రముఖ అనువాదకులు లక్ష్మి రెడ్డి, కేంద్రీయ సాహిత్య అకాడమీ తీరు తెన్నుల గురించి సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, అనువాదకులు దుగ్గిరాల సుబ్బారావు, తమిళనాట తెలుగు ఉద్యమానికి అంకితమైన నంద్యాలరెడ్డి నారాయణ రెడ్డి ఆ ఉద్యమ స్వభావాన్ని గురించి మాట్లాడతారు. ఈ సెషన్ తరువాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ, చర్చలు ఉంటాయి.

'వర్తమాన సాహిత్యం- భిన్న దృక్పథాలు'అనే సెషన్‌లో ప్రసిద్ధ రచయిత్రి, సారంగ సాహిత్య పత్రిక ఎడిటర్ కల్పనా రెంటాల 'మన సాహిత్యం స్త్రీలూ పురుషులూ' అనే అంశం మీద మాట్లాడతారు. ఇంగ్లీషులోకి  తెలుగు అనువాదాల గురించి ప్రముఖ విద్యావేత్త సి. ఆర్. విశ్వేశ్వర రావు, పుట్టపర్తి అభ్యుదయ వాదం గురించి మహాకవి పుట్టపర్తి కుమార్తె, నాగపద్మిని పుట్టపర్తి మాట్లాడతారు. ఇదే సెషన్ లో ప్రముఖ విద్యావేత్త జే. ప్రతాప్ రెడ్డి కూడా మాట్లాడతారు. ఈ సెషన్‌ తర్వాత కూడా స్వీయ రచనల పఠనం, పుస్తకావిష్కరణ,  చర్చలు ఉంటాయి.

మరిన్ని వార్తలు