అమెరికాలో తెలుగు సంబరం

19 Jun, 2018 17:30 IST|Sakshi

వేడుకలకు సిద్ధమైన నాటా

జులై 6,7,8 తేదీల్లో నాటా మహాసభలు

ఫిలడెల్ఫియా వేదికగా కన్వెన్షన్

ఫిలడెల్ఫియా (అమెరికా) : సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసొషియేషన్ (నాటా) ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం వేదికగా జులై 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న నాటా మహా సభలకు ఏకంగా 13 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు.

సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహా వృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాటా.. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. నాటా ప్రతి రెండేళ్లకి ఒకసారి కన్వెన్షన్ నిర్వహిస్తుంది. 2016లో డల్లాస్‌లో, ఈ సారి ఫిలడెల్ఫియోలో వేడుకలు నిర్వహిస్తోంది. నాటా సమాజ సేవలో ముందుండడం, పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం, తెలుగు వారి అవసరాలు తీర్చేలా ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో అమెరికాలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ తనవంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించింది.

ఈ సారి మహాసభలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, వేర్వేరు పార్టీల రాజకీయ నాయకులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇక మహాసభల్లో సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పలువురు సినీ నటులు, దర్శకులు, గాయినీ గాయకులు, రచయితలు, టీవీ ఆర్టిస్టులు నాటా వేడుకల కోసం అమెరికా వస్తున్నారు. మహాసభలకు ముందస్తుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నాటా నారి పేరుతో మహిళా సదస్సులు, యువత కోసం యూత్ వెల్‌నెస్ కార్యక్రమాలు, అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, యూఎస్‌లోని వేర్వేరు నగరాల్లో ఆర్ట్ కాంపిటీషన్స్ , మ్యాట్రిమోనీ కార్యక్రమాలు నిర్వహించింది. నాటా మాట పేరుతో ఓ పత్రిక కూడా విడుదల చేసింది.

గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు
అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంసృతి, వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాం. ఈ సారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13వేల మంది రానున్నారని సగర్వంగా చెబుతున్నాను. గత ఆరు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవాదళం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణలోని ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాం. బాలిక సంరక్షణ కోసం వరంగల్‌లో నిర్వహించిన జానపద నృత్య రీతులు నాటా చరిత్రలో సరికొత్త మైలురాయి. ‘సమాజ సేవే నాటా మాట - సంసృతి వికాసమే నాటా బాట’ అన్న మా నినాదాన్ని నిజం చేసే దిశగా ప్రయాణిస్తున్నాం.

డాక్టర్ ప్రేం సాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ 
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ (నాటా)తో ఎన్నారైలకు వీడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి మహాసభలకు తెలుగు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దీవిస్తున్నారు. తెలుగు అనే భాష కింద అంతరాల్లేవు. ప్రాంతీయ బేధాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం.  ఎక్కడో నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. నాకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా ఊళ్లో కరెంటు గానీ, తాగు నీరు గానీ లేవు. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి అతి పెద్ద ఆస్పత్రుల నెట్ వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45వేల అమెరికన్లకు ఉద్యోగలిచ్చా. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు. నేను సంపాదించిన దాన్ని సమాజానికి పంచేందుకు దాత్రుత్వాన్ని ఎంచుకున్నా. సమాజానికి వీలైనంత అందిస్తున్నా. అదే స్పూర్తితో నాటాను ఏర్పాటు చేశాం. నడిపిస్తున్నాం.

నాటా వేదికగా వైఎస్సార్ జయంతి
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్‌సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా డా.వైఎస్సార్ ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు