ప్రమాదవశాత్తూ ఎన్నారై టెకీ మృతి

17 Jan, 2018 22:02 IST|Sakshi

వాషింగ్టన్‌:  అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌ వాసి మృతి చెందారు. భరత్‌రెడ్డి నరహరి (37) అనే టెకీ బాప్తిస్ట్‌ హెల్త్‌ సౌత్‌ ఫ్లొరిడాలో విధులు నిర్వహిస్తుండేవారు. సైక్లిస్ట్‌ అయిన భరత్‌రెడ్డి డాల్ఫిన్స్‌ క్యాన్సన్‌ ఛాలెంజ్‌ ఈవెంట్‌ కోసం ఏర్పాటు చేయనున్న పోటీలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత శనివారం నైరుతి మియామి డేడ్‌లో జరిగిన ట్రయథ్లాన్‌ (సైక్లింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌) పోటీలో పాల్గొన్నారు.

236 స్ట్రీట్‌ 87 ఎవెన్యూకు మరికాసేపట్లో చేరుకుంటారనగా లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్‌రెడ్డితో పాటు మరో సైక్లిస్ట్‌ గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందారని బాప్తిస్ట్‌ ఐటీ విభాగం వెల్లడించింది. ఇప్పటివరకూ ఆయన పలు 5కే రన్‌, సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొని ఎంతో మందిలో స్ఫూర్తినింపారని టీమ్‌ హామర్‌ హెడ్స్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. భరత్‌రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భరత్‌రెడ్డి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

టీమ్‌ హామర్‌ హెడ్స్‌లో భరత్‌రెడ్డి యాక్టీవ్‌ సభ్యుడు. మియామి గో రన్‌ రన్నింగ్‌ క్లబ్‌లో ట్రయాథ్లాన్‌లో శిక్షణ తీసుకున్న ఆయన వచ్చే నెల 10న నిర్వహించనున్న డాల్ఫిన్స్‌ క్యాన్సర్‌ ఛాలెంజ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 2010లో మొదలుపెట్టిన ఆ ఛారిటీ ఈవెంట్‌లో ఈ ఏడాదికిగానూ 22.5 మిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం నిర్వహించిన ఓ సన్నాహక ఈవెంట్లో పాల్గొని భరత్‌రెడ్డి మృతిచెందడం ఇతర సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. భరత్‌రెడ్డి పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు. భరత్‌రెడ్డి మరణవార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు