ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌కు ఘన నివాళి

2 Sep, 2018 16:57 IST|Sakshi

మెల్‌బోర్న్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అస్ట్రేలియాలోని ఆయన అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. యార్లగడ్డ రమ్యశ్రీ, రాజేశ్‌, ఉదయ్‌, సాయిల ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ తన పాలన కాలంలో ఎన్నో మార్గదర్శకమైన పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. వైఎస్సార్‌ మిగతా కాంగ్రెస్‌ నాయకుల్లా సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కాదని.. ఆయన ప్రజా నాయకుడు అని కొనియాడారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల మనసులు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. పాలనపరంగా ఆయన ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

అంతకు ముందు, ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని విధంగా వైఎస్సార్‌ సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని అన్నారు. మహానేత లోకాన్ని విడిచి వెళ్లి 9 ఏళ్లు అవుతున్నా ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్స చేయించుకున్న వారిలో ఆనందాల్లో, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందిన విద్యార్థుల విజయాల్లో ఆయనను చూస్తునే ఉన్నామన్నారు. దురదృష్టావశాత్తు హెలికాఫ్టర్‌ ప్రమాదంలో గొప్ప నేతను కొల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి ప్రజల కోసం పోరాడుతున్నారని తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 2014 ఎన్నికల్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినప్పటికీ.. వైఎస్‌ జగన్‌ ప్రజల మధ్య ఉంటూ ప్రతిపక్ష నేతగా తనను తాను నిరూపించుకున్నారని అన్నారు.

వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని రమ్య శ్రీ అన్నారు. ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నది కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని.. ఈ విషయంలో ఆయన విజేతగా నిలిచారని గుర్తుచేశారు. మిగతా పార్టీలు ఈ విషయంలో యూటర్న్‌లు తీసుకున్నా వైఎస్‌ జగన్‌ ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం తన సంకల్పాన్ని వదిలిపెట్టలేదన్నారు. ఏపీ ప్రజల బాగుకోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్‌లో లేకపోయినప్పటికీ.. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకవెళ్లి.. 2019లో వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చెస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు