ఆస్ట్రేలియాలో తెలం‘గానం’..

2 Jun, 2018 21:16 IST|Sakshi
వేదికపై అతిథులు..

సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియన్‌ తెలంగాణ ఫోరం (ఏటీఎఫ్‌) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ సలహాదారు అనురాగ్‌ శర్మ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ముఖ్య అతిథులుగా, ఆస్ట్రేలియా ప్రజా ప్రతినిధులు జూలీ ఓవెన్స్‌, జూలియా ఫిన్‌, స్కాట్‌ ఫార్లో, హగ్‌ మెక్‌ డర్మాట్‌, డేవిడ్‌ క్లార్క్‌ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

తెలంగాణ అమరులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నివాళులు అర్పించిన అనంతరం అతిథులు వేడుకలు ప్రారంభించారు. తెలంగాణ ఆట, పాటలతో సభా ప్రాంగణం ఉర్రూతలూగింది. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌  మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించడమే కేసీఆర్‌ లక్ష్యమనీ, పారిశ్రామిక ప్రగతికి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాదాన్యిమిస్తోందని అన్నారు. రాష్ట్రంలో విరివిగా పెట్టబడులు పెట్టి బంగారు తెలంగాణ సాధనలో భాగం కావాలని ఎన్నారైలను కోరారు.

విదేశాల్లో ఉంటూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎన్నారైల కృషి ఎనలేనిదని అనురాగ్‌ శర్మ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించారని అభినందించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందనీ.. టీఎస్‌ ఐపాస్‌ విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

‘తెలంగాణ సాధించుకోవడంతోనే మన కర్తవ్యం పూర్తయినట్టు కాదనీ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరం బాధ్యత వహించాల’ని ఏటీఎఫ్‌ అధ్యక్షుడు అశోక్‌ మాలిష్‌ అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఏటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ సేరి మాట్లాడారు.  ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.
 
కార్యక్రమంలో తెలంగాణ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫోరం (ఆస్ట్రేలియా) అధ్యక్షుడు అశోక్‌ మరం, సందీప్‌ మునగాల, సున్లీ్‌ కల్లూరి, మిథున్‌ లోక, వినయ్‌ యమా, ప్రదీప్‌ తెడ్ల, గోవర్దన్‌ రెడ్డి, అనిల్‌ మునగాల,  కిశోర్‌ రెడ్డి, నటరాజ్‌ వాసం, శశి మానెం, డేవిడ్‌ రాజు, ఇంద్రసేన్‌ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహ్మ రెడ్డి, ప్రమోద్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు