పల్లె సేవలో ప్రవాసులు

27 Sep, 2019 11:53 IST|Sakshi
సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూర్‌ వ్యూ

గ్రామ పంచాయతీ కోఆప్షన్‌ సభ్యులుగా ఎన్‌ఆర్‌ఐలు

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అందివచ్చిన అవకాశం

గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న గల్ఫ్‌ వలస జీవులు

సాక్షి, నెట్‌వర్క్‌:  కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలలో ఎన్‌ఆర్‌ఐలను కోఆప్షన్‌ సభ్యులుగా నియమించడానికి అవకాశం ఏర్పడింది. దీంతో పలు పల్లెల్లో కోఆప్షన్‌ సభ్యులుగా ప్రవాసులు పదవులు పొందారు. సీనియర్‌ సిటిజన్‌ లేదా ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగి ఒకరు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఎన్‌ఆర్‌ఐ కోటాలో మరో వ్యక్తిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమించడానికి పంచాయతీరాజ్‌ శాఖ అనుమతి ఇచ్చింది. గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి వచ్చిన ఎంతో మంది కోఆప్షన్‌ పదవిని అలంకరించారు. సవరించిన పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా తమకు ఒక మంచి అవకాశం లభించిందని, పంచాయతీల అభివృద్ధికి సహాయం అందిస్తామని వారు చెబుతున్నారు.  ఇప్పటికే పలు గ్రామాలలో గల్ఫ్‌ వలస జీవులు అభివృద్ధి పనులకు చేయూత ఇచ్చారు. ఇలా.. ఊరికి ఉపకారం చేసిన వారిపై అభిమానంతో వారిని గ్రామస్తులు కోఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు. పల్లెల అభివృద్ధిలో భాగస్వాములైన గల్ఫ్‌ వలస జీవుల మనోగతం వారి మాటల్లోనే...

సమష్టిగా సమస్యల పరిష్కారం
బతుకుదెరువు కోసం పదిహేనేళ్లు దుబాయికి వెళ్లా. అక్కడ సెంట్రింగ్‌ కార్మికునిగా పనిచేశా. నాలుగేళ్ల క్రితం దుబాయి నుంచి వచ్చి.. స్థానికంగానే పనిచేస్తున్నా.  ఇటీవల గ్రామ పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుడిగా నన్ను ఉండాలన్నరు. సీనియర్‌ సిటిజన్‌ కోటాలో ఎన్నికయ్యా. మా తండ్రి శివయ్య జ్ఞాపకార్థం బస్‌షెల్టరు నిర్మిస్తా. – మ్యాదరి దేవయ్య, జోగాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా

ఊరు కోసం పనిచేస్తా..
మాది సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట. ఉపాధి కోసం 2008లో మస్కట్‌ వెళ్లి కూలీ పనులు చేశాను. అక్కడ ఆరేళ్ల పాటు ఉన్నా. జీతం కొద్దిగా ఉండడంతో 2014లోగ్రామానికి వచ్చిన. అప్పటి నుంచి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ కిరాణం షాపు నడిపించుకుంటున్నా. నన్ను కోఆప్షన్‌ సభ్యుడిగా ఉండాలని గ్రామస్తులు కోరితే ముందుకు వచ్చా. భవిష్యత్‌లోనూ ఊరు కోసం పనిచేస్తా.  – చిగుర్ల మల్లేశం  

పేదలకు సేవ చేస్తా..
నాది చందుర్తి మండలం జోగాపూర్‌. ఉపాధి కోసం దుబాయికి వెళ్లాను. ఎనిమిదేళ్లు అక్కడే కంపెనీలో పనిశాను. పదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నా. దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాను. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు మృతిచెందగా.. అ చిన్నారుల పేరుపై రూ.1.80 లక్షలు ఫిక్స్‌ డిపాజిట్‌ చేయించా.  నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నా. నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యునిగా ఎన్నుకున్నారు.      – మ్యాకల పరశురాములు

నా వంతు సాయం..
ఏడు సంవత్సరాలు గా దుబాయిలో వలస కూలీగా ఉన్నా. కొ న్నేళ్లుగా ఊరికి దూరమయ్యాను. అప్పుడప్పుడు ఊరికి వస్తే.. ఇక్కడే ఉండాలనిపించేది. ఈ మధ్యనే గ్రామానికి వచ్చేశాను. ఇక ఊళ్లోనే ఉండాలని.. అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోఆప్షన్‌ సభ్యుడిగా నియామకమయ్యాను. ప్రజలకు సేవ చేయాలనేదే నా కోరిక.   – మహమ్మద్‌ ఫసి, నర్సాపూర్‌(జి),నిర్మల్‌ జిల్లా

గ్రామాన్ని మారుస్తా..
నేను పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాను. అక్కడ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాను. మా గ్రామస్తులు నన్ను కోఆప్షన్‌ మెంబర్‌గా ఎన్నుకున్నారు. దుబాయిలో పారిశుద్ధ్యం తీరును చూసిన నేను.. మా గ్రామంలో కొంతవరకైనా అమలు చేయాలనుకుంటున్నా. గ్రామాభివృద్ధికి చేయూత ఇస్తా.– సంజీవ్‌రెడ్డి, కుమ్మర్‌పెల్లి, రాయికల్‌మండలం, జగిత్యాల జిల్లా  

సేవ చేసే అవకాశం దక్కింది
నేను తిమ్మాపూర్‌కు కోఆప్షన్‌ సభ్యునిగా ఎన్నికయ్యాను. ఈ పదవి ద్వారా మా గ్రామానికి సేవ చేసే అవకాశం దక్కింది. కువైట్, దుబాయిలలో వ్యాపారం చేస్తున్ననేను మా గ్రామానికి ఏదైనా చేయాలని భావించాను. కోఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయడంతో గ్రామానికి ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి సిద్ధమయ్యాను. సొంత గ్రామం రుణం తీర్చువకోవాడానికి ఇది అవకాశం అనుకుంటున్నా.– దాసరి సంతోష్, తిమ్మాపూర్, మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా)

గ్రామాభివృద్ధికి బాటలు వేస్తాం..
మా సొంత ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర. నేను దుబాయికి సామాన్య కార్మికుడిగా వెళ్లాను. అక్కడే కంపెనీ ఏర్పాటు చేశాను. దుబాయిలో ఈటీసీఏ (ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడిగా ఉన్నా. మా ఊళ్లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత ఇచ్చాను. గుడిని రూ.1.50లక్షలతో అభివృద్ధి చేశాను. మరో రూ.1.50 లక్షలతో స్కూల్‌కు ఫర్నిచర్‌ అందించాను. ఆడ పిల్లల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు అందిస్తున్నా. మున్ముందు కూడా గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తా. కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
– రాధారపు సత్యం, అడవి పదిర

పేదలకు సాయం చేస్తా..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మల్లారం సొంత ఊరు. పదేళ్లుగా దుబాయిలో చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. నెలకోసారి ఇంటికి వస్తా. మా ఊరిలో పేదలకు సాయం చేస్తా. గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాను. స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు, ప్రొజెక్టర్‌ అందించా. ఇటీవలే గ్రామాభివృద్ధి కోసం కొత్త పాలకవర్గానికి సహకారం అందించాను. నేను దుబాయిలో ఉండగానే నన్ను గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుడిగా ఎనుకున్నందుకు సంతోషం. గ్రామానికి మరింత చేయూతనిస్తా. – కొమ్ము అశోక్‌  

అందరి సహకారంతో ఎన్నిక..
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌. నేను 2006లో గల్ఫ్‌ వెళ్లాను. అక్కడే రెండేళ్లు పనిచేశాను. దుబాయిలో మన వాళ్లు పడే కష్టాలను కళ్లారా చూశాను. ఇంటికి వచ్చి మళ్లీ వ్యవసాయం చేశాను. ఈ మధ్యనే సిరిసిల్లలో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నా. ఊళ్లో ఏ పని జరిగినా నేను అందరితో పాటు పాల్గొంటా. ఇటీవల గ్రామ కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికయ్యా. పాలకవర్గం సభ్యుల సహకారంతో గ్రామాభివృద్ధికి పాటుపడుతా.– కనమేని శ్రీనివాస్‌రెడ్డి

ఊరిని తీర్చిదిద్దుతాం..
రుద్రంగి మండలం మానాల శివారులోని గైదిగుట్టతండా మా స్వగ్రామం. మునుపు మా ఊరు నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఉండేది. నేను రెండేళ్ల పాటు సౌదీ అరేబియా వెళ్లి వచ్చా. ఇప్పుడు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నా. మా తండా కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. నాకు గ్రామ కోఆప్షన్‌ సభ్యుడిగా అవకాశం లభించింది. ఊరిలో వీధులను అందంగా తీర్చిదిద్దేందుకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సంకల్పించా. అందరం సమష్టిగా ఊరును అభివృద్ధి చేసుకుంటాం.– ధరావత్‌ రవి

సేవకు గుర్తింపు లభించింది
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి. నేను 14 ఏళ్లు దుబాయికి వెళ్లా.ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఇంటికి వచ్చాను. ఊరిలో సాయిబాబాఆలయ అభివృద్ధికి రూ.4 లక్షలు ఇచ్చా. కళాశాలలో విద్యార్థులకు కంప్యూటర్లు సమకూర్చాను. ట్రీ గార్డులకు ఆర్థిక సాయం అందించా.నేను ఊరికి చేసిన సేవలను గుర్తించి గ్రామ పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుడిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. భవిష్యత్‌లోనూ ఊరి అభివృద్ధికి నా వంతు సహకారం ఉంటుంది. – ఎర్రం గంగనర్సయ్య

మరిన్ని వార్తలు