భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్ ఫారం నింపాలి

11 Apr, 2020 14:54 IST|Sakshi

మస్కట్ : ఒమన్ నుండి భారత్‌కు ప్రయాణించేవారికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ప్రకటన జారీ చేసింది. భారత్‌కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా భారతదేశానికి అత్యవసరంగా ప్రయాణించడానికి ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్‌లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 14 ఏప్రిల్ 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయులు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది.

భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని, విమానాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఒమన్ నుండి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్‌సైట్‌లోని ఈ లింకు ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని రాయబార కార్యాలయం తెలిపింది.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform 

భారత్‌కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు చేరుకున్నాక, వారిని నేరుగా వారివారి ఇళ్లకు పంపి 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వీయ నిర్బంధం) చేయడమా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడమా అనే దానిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. 'గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చిన్న ఇండ్లు కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' కొరకు  ప్రత్యేకంగా విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో తగినన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండవచ్చని' భీరెడ్డి అన్నారు. 

ఆర్ధిక మాంద్యం వలన భవిష్యత్తులో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా "గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ" కి రూపకల్పన చేయాలని మంద భీరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు