నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు

24 Jan, 2020 11:06 IST|Sakshi
ఖతార్‌లో వివిధ దేశాల కార్మికులు, ప్రతినిధులతో ధర్మేందర్‌

గల్ఫ్‌ దేశాల్లోని పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి

లైసెన్స్‌డ్‌ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలి విజిట్‌ వీసాలపై వెళ్తే కష్టాలు..

ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు తోట ధర్మేందర్‌

వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల: ‘కంపెనీలో పనిలేదు.. మిమ్మల్నిభరించే శక్తి కంపెనీకి లేదు.. ఇప్పటికే ఆరు నెలలుగా పనిలేకున్నా జీతాలు ఇస్తున్నాం.. ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు. ఎవరి దేశానికి వారు వెళ్లిపోండి.. అని ఖతార్‌లోని కంపెనీ యాజమాన్యం చెప్పినప్పుడు 2200 మంది కార్మికుల గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్లయింది. అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉన్న పళంగా ఇంటికి పొమ్మంటే ఎలా అని అందరం బాధపడ్డాం. ఒక్క ఇండియా వాళ్లే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, పిలిప్పీన్‌ దేశాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. అందరిదీ అదే పరిస్థితి. ఖతార్‌లోని చట్టాలపై అవగాహన ఉన్న వారిని ఆశ్రయించాం. ఆ దేశంలో ఉపాధి అవకాశాలను అధ్యయనం చేశాం. ఓ పరిష్కారం దొరికింది. మా వద్ద పని లేదని.. మా కార్మికులు ఎక్కడ పనిచేసినా మాకు అభ్యంతరం లేదని మేం పనిచేస్తున్న కంపెనీ ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) ఇస్తే చాలు. బయట పని దొరుకుతుందనే విషయం తెలిసింది. ఆ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల్లో ఎన్‌ఓసీ లభించింది. అందరికీ ఆ దేశంలోనే మరో కంపెనీలో ఉద్యోగాలు దొరికాయి’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామానికి చెందిన తోట ధర్మేందర్‌ చెప్పారు. ధర్మేందర్‌ ప్రస్తుతం ఖతార్‌లో ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)కు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే క్రమంలో కార్మికులు మోసాలకు, కష్టాలకు గురికాకుండా వలస జీవుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఖతార్‌లో ఉండే ధర్మేందర్‌ అక్కడి పరిస్థితులు.. ఓఎఫ్‌డబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరించారు.

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
గల్ఫ్‌కు వెళ్తే చాలు.. బతికేయవచ్చనే భావన వీడాలి. ఆ దేశాల్లో సంపాదన అంత సులువుకాదు. ఇండియాలో ఉండగానే ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధించాలి. అది ఏ పని అయినా సరే. ఆ పనిలో పూర్తి పట్టు సాధించాలి. పనిలో నైపుణ్యం లేకుండా ఏదో ఒక పని చేస్తాంలే అనుకుని గల్ఫ్‌కు వెళ్తే చేతులారా కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. సులువైన పనికావాలని ఏజెంట్లతో చెప్తారు. దీనిని అలుసుగా తీసుకుని ఏజెంట్లు సులువైన పనే దొరుకుతుందని పంపిస్తారు. ఆ దేశాల్లో కష్టమైన పని ఎదురైతే తట్టుకోలేక ఇబ్బందులు పడతారు. ఏ దేశం వెళ్తున్నామో.. ఆ దేశ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి భాష, చట్టాలు తెలిసి ఉండాలి. ఆ దేశాల్లోని పరిస్థితులపై పట్టు సాధిస్తే నైపుణ్యంతో రాణిస్తారు.

నేనూ కష్టాలు అనుభవించా..
నేను పదో తరగతి వరకే చదువుకున్నా. 2007లో తొలిసారి మస్కట్‌ వెళ్లాను. రూ.1.20 లక్షలు వీసాకు వెచ్చించి డీజిల్‌ పంప్‌ ఆపరేటర్‌గా పనిలో కుదిరాను. ఏజెంట్‌ 120 రియాళ్లు జీతం అన్నాడు. ఆయన మాటలు నమ్మి పోతే.. అక్కడికి వెళ్లాక రూ.60 రియాళ్లు ఇచ్చారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలేవి. వీసాకు చేసిన అప్పులు తీర్చడానికే ఏడాదిన్నర పట్టింది. ఖాళీ సమయంలో అక్కడే టవర్‌ క్రేన్‌ ఆపరేటింగ్‌ నేర్చుకున్నా. అక్కడే లైసెన్స్‌ పొందాను. మళ్లీ ఖతార్‌ వెళ్లాక మంచి వేతనంతో స్థిరపడ్డా. 

హక్కులు, చట్టాలగురించి తెలుసుకున్నా..
ఢిల్లీకి చెందిన రాజీవ్‌శర్మ ఖతార్‌లోకలిశాడు. ఆయన కలిసిన తరువాత అక్కడ పనిచేసే వలస కార్మికుల హక్కులు.. కనీస వేతన చట్టాల గురించి తెలిసింది. బిల్డింగ్‌అండ్‌ వుడ్‌ వర్కర్‌ ఇంటర్నేషనల్‌ (బీడబ్ల్యూఐ)లో చేరాం. వలస కార్మికుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. ఆయన భారత రాయబార కార్యాలయం అధికారులతోనూ మాట్లాడి మన వారికి న్యాయ సహాయం అందిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇండియాలోని అన్ని రాష్ట్రాల వారితో కలిసి ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఓఎఫ్‌డబ్ల్యూఏ)ను ఏర్పాటు చేశాం. తెలంగాణలోని పలు జిల్లాల వారు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఖతార్‌లోని ఎంబసీ అధికారులతో కలిసి పనిచేస్తాం. ఎవరికైనా కంపెనీ జీతాలు సక్రమంగా ఇవ్వకుంటే మాట్లాడి ఇప్పిస్తాం. వలస కార్మికులకు హెల్త్‌కార్డులు ఇప్పించాం. కార్పొరేట్‌ వైద్యసేవలు, అదనపు పని గంటలకు అదనపు వేతనం, కంపనీలో లాండ్రి వసతులు కల్పించాం. ఇలా వలస కార్మికుల సంక్షేమం కోసం మా సంస్థ పనిచేస్తుంది. వివిధ కంపనీల్లో మా సంస్థ చొరవతో పది వేల మందికి జీతాలు పెరిగాయి. రెండేళ్లకోసారి స్వస్థలాలకు వచ్చే వారికి జీతంతో కూడిన సెలవులు ఇప్పించడం, విమాన టిక్కెట్లు ఇప్పించడం వంటి సదుపాయాలు కల్పించాం. ఎవరైనా కార్మికులు చనిపోతే వారి మృతదేహాలను స్వగ్రామాలకు   పంపడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేశాం. ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్లతో కలిసి వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. గల్ఫ్‌కు కొత్తగా వెళ్లే వారికి.. వెళ్లాలని ఆలోచనలో ఉన్న వారికి నేను చెప్పేది ఒక్కటే..  ఏ నైపుణ్యమూ లేకుండా ఇక్కడైనా.. ఎక్కడైనా రాణించలేరు. పని నేర్చుకోండి.. పైసలు సంపాదించుకోండి.

సబ్‌ ఏజెంట్లను ఆశ్రయించవద్దు
గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలనుకునే వారు సబ్‌ ఏజెంట్లను ఆశ్రయించవద్దు. వారు కమీషన్‌ కోసం పనిచేసే బ్రోకర్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా లైసెన్స్‌డ్‌ ఏజెన్సీలు, బ్రాంచీలు ఉన్నాయి. తప్పని సరిగా లైసెన్స్‌ కలిగి ఉన్న రిక్రూటింగ్‌ ఏజెన్సీ ద్వారానే వెళ్లాలి. గల్ఫ్‌లోని ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాకు మన కరెన్సీలో రూ.30వేలు గానీ, 45 రోజుల వేతనంగానీ  మాత్రమే చెల్లించాలి. వీసా డబ్బులను విధిగా ఏజెంట్‌ బ్యాంకు ఖాతాలోనే వేయాలి. నేరుగా నగదు చేతికి ఇవ్వవద్దు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక రిక్రూటింగ్‌ ఏజన్సీ ‘టాంకాం’ కూడా ఉంది. దాని ద్వారా కూడా గల్ఫ్‌ దేశాలకు వెళ్లవచ్చు. ఏ దేశానికి వెళ్లినా.. వీసా కాపీ, కంపెనీ వివరాలు, ఫోన్‌ నంబరు తప్పని సరిగా ఇంటి వద్ద ఉంచాలి.

మరిన్ని వార్తలు