‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ తప్పనిసరి

29 Jun, 2019 13:08 IST|Sakshi

గల్ఫ్‌ డెస్క్‌ : గల్ఫ్‌ తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ఈసీఆర్‌ పాస్‌పోర్ట్‌ కలిగిన భారతీయ కార్మికులకు రూ.10 లక్షల విలువైన ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ అనే ప్రమాద బీమా పాలసీని జారీచేయడం తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అవగాహన లేక చాలా మంది కార్మికులు బీమా చేయించుకోకపోవడంతో నష్టపోతున్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన కమటం కొమురయ్య(46) సౌదీ అరేబియాలోని అభా ప్రాంతంలో ఏప్రిల్‌ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొమురయ్య మృతదేహం కలిగిన శవపేటిక జూన్‌ 25న సౌదీ నుంచి స్వగ్రామానికి చేరింది. 

అయితే, కొమురయ్య సౌదీకి వెళ్లేటప్పుడు 2016 సెప్టెంబర్‌లో రెండేళ్ల కాలపరిమితిగల బీమా పాలసీ చేశాడు. అది 2018 సెప్టెంబర్‌ 28న ముగిసింది. కేవలం రూ.318 చెల్లిస్తే మరో రెండేళ్లపాటు గడువు పొడిగింపబడి రెన్యూవల్‌ అయ్యేది. అవగాహన లేక రెన్యూవల్‌ చేయించుకోలేదు. దీంతో బీమా వర్తించక కొమురయ్య కుటుంబం రూ.10 లక్షలు నష్టపోయింది.  గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం, సలహాల కోసం ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం సహాయ కేంద్రం మొబైల్‌ నెంబర్‌ +91 94916 13129 కు కాల్‌ చేయవచ్చునని సంస్థ ప్రతినిధి స్వదేశ్‌ పర్కిపండ్ల తెలిపారు.  

మరిన్ని వార్తలు