ఫిలిప్పీన్స్‌లో భారత విద్యార్థులపై దాడి

4 Apr, 2018 15:53 IST|Sakshi
గాయపడిన ఎంబీబీఎస్‌ విద్యార్థి అనురాగ్‌ నాయుడు

సాక్షి, మనీలా :  ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ విద్యనభ్యసిస్తన్న భారతీయ విద్యార్థులపై తాగిన మత్తులో ముగ్గురు స్థానికులు దాడికి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన అనురాగ్‌ నాయుడు కొసానా బికాల్‌లో అల్బే లిగాజ్పీ నగరంలోని అమెక్‌ బీసీసీఎమ్‌(ఎగో మెడికల్‌ ఎడ్యుకేషనల్‌ సెంటర్‌ బైకాల్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌)లో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. గత ఆదివారం బన్యడెరోలోని కేరళకు చెందిన తమ స్నేహితుడు హేమంత్‌ దగ్గరికి వెళ్లగా, తాగిన మైకంలో ముగ్గురు స్థానికులు అనురాగ్‌ నాయుడుతోపాటూ, విజయవాడకు చెందిన అఖిల్‌ గారపటిపై దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో అనురాగ్‌ నాయుడు కంటికి గాయం అయ్యింది. అనురాగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు బనాడెరో బ్రాంగే( అక్కడి స్థానిక ప్రతినిధి)ని సంప్రదించాలని చెప్పారని అనురాగ్‌ తెలిపారు. అక్కడికి వెళ్లినాకూడా తమకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు. ఫిలిప్పీన్స్‌లో స్థానికుల ఆగడాలు శృతిమించుతున్నాయని, భారత విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనురాగ్‌ నాయుడు కోరారు. భారత విద్యార్థులపై ఫిలిప్పీన్స్‌లో గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయని అనురాగ్‌ సాక్షితో తెలిపారు.

>
మరిన్ని వార్తలు