గల్ఫ్‌ నుంచి వచ్చి.. కులవృత్తిలో రాణించి..

25 Oct, 2019 11:58 IST|Sakshi
స్వగ్రామంలో ఫర్నిచర్‌ పనులు చేస్తున్న రమేష్‌

ఫర్నిచర్‌ తయారీతో స్వగ్రామంలోనే ఉపాధి  

సౌదీలో వచ్చిన జీతంతో సమానంగా సంపాదన

ఆదర్శంగా నిలుస్తున్న రమేష్‌

వూశకొయ్యల గంగాకిషన్, నవీపేట (నిజామాబాద్‌ జిల్లా): గల్ఫ్‌ దేశాలలో సంపాదన బాగుంటుందని తలచిన ఆ యువకుడు ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. కానీ, విజిట్‌ వీసాపై వెళ్లడంతో ఆశలు ఆవిరయ్యాయి. యేడాదిలోపే అక్కడి పోలీసులు స్వగ్రామానికి పంపించేశారు. అయితే, అప్పుల బాధలు అతడిని మళ్లీ గల్ఫ్‌ వైపు మళ్లించాయి. రెండోసారి ఖతార్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాకు బదిలీపై వెళ్లి స్థిరపడుతున్న సమయంలోనే కంపెనీ మూతపడింది. దీంతో గల్ఫ్‌పై మక్కువ చంపుకుని స్వగ్రామంలోనే ఉపాధి పొందాలనుకున్నాడు. కులవృత్తి అయిన వడ్రంగి పనిలో మెళకువలను నేర్చుకుని గల్ఫ్‌లో సంపాదించే డబ్బులకు సమానంగా ప్రస్తుతం ఇక్కడే సంపాదిస్తున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని నాగేపూర్‌ గ్రామానికి చెందిన గన్నోజి రాజన్న, సక్కుబాయిల రెండో కుమారుడు రమేష్‌ పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఉన్నత చదువులు చదవాలని తలంచినా.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చదువుకు దూరం చేశాయి. తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని తలచి 2006లో దుబాయికి వెళ్లాడు. అందరూ విజిట్‌ వీసాపై వెళ్లి పనులు చేయడంతో ఆకర్షితుడైన రమేష్‌ అక్కడికి వెళ్లాడు. అక్కడిక్కడ కూలీ పనులు చేస్తున్న రమేష్‌ను పోలీసులు పట్టుకుని 2007లో ఇండియాకు పంపించేశారు. ఆశగా వెళ్లి ఆవేదనతో వచ్చిన రమేష్‌కు గ్రామానికి రాగానే మళ్లీ అప్పుల బాధలు వెంటాడాయి. 2009లో జేఅండ్‌పీ కంపెనీ వీసాపై ఖతార్‌కు వెళ్లాడు. వడ్రంగి వృత్తిలో ప్రావీణ్యుడైన రమేష్‌ ఫర్నిచర్‌ తయారీ ఉద్యోగంలో స్థిర పడ్డాడు. 2011లో అదే కంపెనీకి చెందిన సౌదీ అరేబియా బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లాడు. 2015లో ఫోర్‌మెన్‌గా ఉద్యోగోన్నతి కల్పించడంతో ఆనందంగా గడిపాడు. నాలుగుపైసలు సంపాదిస్తున్నానన్న ఆనందంలో ఉండగా.. పిడుగులాంటి వార్త వినబడింది. కంపెనీ దివాలా తీసిందని 2018లో మూసివేశారు. ఆరు నెలల జీతం..ఏడు నెలల సర్వీస్‌ డబ్బులు ఇవ్వకుండానే రమేష్‌ను కంపెనీ యాజమాన్యం ఇంటికి పంపించింది.

మనోధైర్యంతో..
రమేష్‌ ఉద్యోగం కోల్పోయి ఇంటికి చేరిన సమయంలో ఆయనకు ఇద్దరు పిల్లలు. ఆ దశలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అని అతను కుంగిపోలేదు. వడ్రంగి వృత్తిలో మరింతగా రాణించి సొంతూళ్లోనే ఉపాధి పొందాలని సంకల్పించాడు. ఫర్నిచర్‌ తయారీలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నాడు. దుబాయి, ఖతార్, సౌదీలలో ఫర్నిచర్‌ పనిచేయడంతో పలు రకాల వస్తువులను తయారు చేయడం సులువుగా నేర్చుకున్నాడు. రూ. లక్షన్నర అప్పు చేసి ఫర్నిచర్‌ తయారీకి ఉపయోగపడే యంత్రాలను, సామగ్రిని సమకూర్చుకున్నాడు. గృహాలకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను తయారు చేస్తూ.. గల్ఫ్‌లో నెలకు సంపాదించే డబ్బులను సొంతూళ్లోనే సంపాదిస్తున్నాడు.

స్వగ్రామమే బెటర్‌: రమేష్‌   
కష్టపడే గుణముంటే ప్రతి ఒక్కరికీ సొంతూరే ఒక గల్ఫ్‌ దేశం అవుతుంది. అమ్మా, నాన్న, భార్యాపిల్లలకు దగ్గరగా ఉంటూ ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. అక్కడ సంపాదించే డబ్బులను ఇక్కడే సంపాదిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. గల్ఫ్‌ దేశాలపై మోజు తగ్గించుకుని ఇక్కడే పనులు చేసుకుంటే అందరూ హాయిగా ఉంటారు.

మరిన్ని వార్తలు