సౌదీ నుంచి మృతదేహాన్ని తెప్పించాలని హెచ్చార్సీకి విజ్ఞప్తి

24 May, 2019 18:15 IST|Sakshi

నెలరోజుల క్రితం సౌదీలో మృతిచెందిన నిజామాబాద్ జిల్లావాసి మృతదేహం కోసం ఎదురుచూపులు 

సహాయం కోసం మానవ హక్కుల కమిషన్ తలుపు తట్టిన మృతుని కుటుంబ సభ్యులు

రియాద్‌ : సౌదీ అరేబియాలోని రియాద్‌లో నెలరోజుల క్రితం మరణించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చౌక రమేశ్(42) అనే కారు డ్రైవర్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మృతుని భార్య లావణ్య తల్లి రుక్కుంబాయి, తమ్ముడు రాజేశ్వర్ మానవహక్కుల కమిషన్‌లో ఫిటిషన్ దాఖలుచేశారు. అనంతరం హెచ్చార్సీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 67 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య లావణ్య ఇద్దరు కుమార్తెలు శివాణి (11), పావని (9) ఉన్నారు.

హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడానికి సహకరించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి సురేందర్‌సింగ్ ఠాకూర్, వలసకార్మికుల హక్కుల కార్యకర్త, న్యాయవాది అబ్దుల్‌ ఖాదర్లు  ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో మరణించినవారి శవాలను తెప్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలలో ప్రత్యేక విభాగాలను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలరూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్‌లో గత ఐదేళ్లలో తెలంగాణ ప్రవాసులు వెయ్యిమందికిపైగా చనిపోయారని వారు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఫోరం హెల్ప్ లైన్ నెం. +91 93912 03187ను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు