'గల్ఫ్' వెళ్తున్న దక్షిణాది మహిళల సంఖ్య పెరిగింది

13 Jul, 2013 17:03 IST|Sakshi

మహిళల్లో చైతన్యం పెరుగుతోంది. ఉపాధి కోసం దేశాంతరాలకు ఒంటరిగా వెళ్లేందుకు కూడా నేటి మహిళలు జంకడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో హై ప్రొఫైల్ ఉద్యోగాలకే కాదు. చిన్న చితకా ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. దక్షిణాది నుంచి గల్ఫ్‌ ప్రాంతానికి ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లే మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని  ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

గత ఐదేళ్ల కాలంలో వీరి సంఖ్య అనేక రెట్లు పెరిగిందని పేర్కొంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఈ సందర్భంగా సోదాహారణగా వివరించింది. గత ఏడాది దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ,కర్నాటక, పాండిచ్చేరిల నుంచి సుమారు పదిహేను వందల మంది గల్ఫ్‌ బాట పట్టారని తెలిపింది. అలాగే ఈ ఏడాది జూన్ వరకు ఐదు వందల మంది దేశాన్ని వదిలి ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్‌కు వలస వెళ్లారని పేర్కొంది. తాము మోసపోకుండా చట్టపరమైన సంస్థల ద్వారానే గల్ఫ్‌కు వెళ్లేందుకు మహిళలు మొగ్గుచుపుతున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

గతంలో భారతీయ మహిళలు బ్రొకర్ల మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి తీవ్ర అగచాట్లు పడేవారు. అయితే దక్షిణాది రాష్ట్రాలు చేపట్టిన చర్యలతో మహిళ్లలో చైతన్యం వచ్చిందని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేంట్స్ (పీఓఈ) చెన్నై విభాగాధిపతి డి.జయశంకర్ శుక్రవారం వెల్లడించారు. మెట్రిక్ అంతకంటే తక్కువ చదువుకున్న మహిళల పాస్పోర్ట్లపై తమ కార్యాలయంకు చెందిన పీఓఈ స్టాంప్ వేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా విదేశాల్లో ఉపాధి పొందేందుకు భారతీయ మహిళలకు ఉపాది అవకాశాలు లభిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు