సిలికానాంధ్ర రామదాసు సంకీర్తనోత్సవం

27 Sep, 2017 13:06 IST|Sakshi

కాలిఫోర్నియా :
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రామదాసు సంకీర్తనోత్సవం అమెరికాలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఘనంగా జరిగింది. మల్లాది రవికుమార్, కొలవెన్ను శ్రీలక్ష్మి, అవ్వారి గాయత్రి ఆధ్వర్యంలో అదిగో భద్రాది, శ్రీరామ నామమే, పలుకే బంగారమాయెనా, శ్రీరాముల దివ్యనామ, రామజోగి మందు, తారకమంత్రము, హరి హరి రామ, తక్కువేమి మనకు, కంటినేడు మా రాముల కీర్తనలను బే ఏరియాలోని కర్ణాటక సంగీత ప్రియులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు భక్తి పారవశ్యంతో పాడారు. అనంతరం సిలికాన్ వ్యాలీలోని వివిధ పలు సంగీత కళాశాలల విద్యార్థులు, ఔత్సాహిక సంగీత కళాకారులు వివిధ రామదాసు కీర్తనలను బృంద గానాలలో రాగయుక్తంగా పాడారు.
 
అనురాధ శ్రీధర్ వయోలిన్ పై, శ్రీరాం బ్రహ్మానందం మృదంగంపై సహకారమివ్వగా మూడుగంటపాటూ విద్వాన్ మల్లాది రవికుమార్ శ్రీరామదాసు సంకీర్తనలను పాడారు. మల్లాది రవికుమార్ తమ గురువులు నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి స్వరపరచిన కీర్తనలను పాడారు. రవికుమార్, అనూరాధ, శ్రీరాం కలిసి కచేరీ చేయటం ఇది మొదటిసారి. సభలో జరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు ఒకరికొకరు సహకరిస్తూ మనోధర్మ సంగీతాన్ని హృద్యంగా అందించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీతవేత్త బ్రహ్మానందం, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ జంధ్యాల రవి అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్ జంధ్యాల రవికుమార్, మనబడి కులపతి చమర్తి రాజు, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ వాయిద్యకారులను సత్కరించారు. జంధ్యాల రవి కూచిపూడి నాట్యం, అన్నమయ్య కీర్తనలతో తనకు సిలికానాంధ్రతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హనిమిరెడ్డి, మల్లాది రవికుమార్ను ఘనంగా సత్కరించారు. కార్డియాలజిస్ట్ పనిచేస్తున్న తను, ఇతర డాక్టర్లు, నర్సులకు రామ శబ్దం ఎలా పరిచయం చేశాడో చెప్పారు. మల్లాది రవికుమార్ మాట్లాడుతూ తన అన్నయ్య శ్రీరాంప్రసాద్, తన తండ్రి సూరిబాబులతో కలిసి అన్నమయ్య, రామదాసు, త్యాగరాజుల సంగీతాన్ని సిలికానాంధ్ర ద్వారా ముందు తరానికి నేర్పించడానికి సహకరిస్తామన్నారు.


సిలికానాంధ్ర ముఖ్యకోశాధికారి కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే రామదాసు కీర్తనలతో లక్షగళార్చన చేయడానికి సిలికానాంధ్ర సిద్ధంగా ఉందన్నారు. కొండిపర్తి దిలీప్ నిర్మించిన పర్ణశాల నమూనా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందసభ్యులు తణుగుల సంజీవ్, సర్వ షీలా, నాదెళ్ళ వంశీ, మల్లాది సదా, గుండ్లపల్లి వాణి, కడియాల కళ్యాణి, వేదుల స్నేహ, వంక రత్నామాల, మాలెంపాటి ప్రభ, కందుల శాయి, మంచికంటి రాంబాబు, గురజాలె దీప్తి, గంధం కిశోర్, కూచిభొట్ల రవి, వేదుల మూర్తి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతో తమవంతు కృషి చేశారు.

మరిన్ని వార్తలు