అమెరికా వ్యాప్తంగా ఘనంగా మనబడి స్నాతకోత్సవాలు

31 May, 2018 14:08 IST|Sakshi

అమెరికా వ్యాప్తంగా వర్జీనియా, న్యూజెర్సీ, అట్లాంటా, చికాగో నగరాలలో మనబడి స్నాతకోత్సవాలు కన్నులపండుగగా జరిగాయి.  ఈ సంవత్సరం సిలికానాంధ్ర మనబడి - తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహణలో జరిగిన పరీక్షల్లో 98.5శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ ప్రాంతాల వారీగా జరిగిన స్నాతకోత్సవాల్లో ధృవీకరణ పత్రాలను అందించారు.  

వర్జీనియా : స్నాతకోత్సవ  కార్యక్రమానికి వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ ముఖ్య అతిధిగా విచ్చేసి, ఉత్తీర్ణులైన విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పట్టాలను బహూకరించారు. వేల మైళ్ల దూరంలో పుట్టి పెరుగుతున్న ఈ చిన్నారులు, తెలుగు భాష నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడుతూ, పరీక్షలు వ్రాసి 98.5% పైగా ఉత్తీర్ణులవడం, వారికి పట్టాలు ప్రదానం చేసే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. విశిష్ట అతిథి గా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ, మనబడి విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తుల్లో వేదిక దగ్గరకు వస్తుంటే, తెలుగు అక్షరాలు కవాతు చేస్తున్నట్టుగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మీయ అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్ సిలికానాంధ్రతో తన అనుబంధాన్ని వివరించారు. సిలికానాంధ్ర మనబడి కుటుంబ సభ్యులంతా, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలి దంపతులతో కేక్ కోయించి, పుట్టినరోజు సంబరాలను జరిపించారు. 

న్యూజెర్సీ : ఎన్‌జే, ఎన్‌వై, సీటీ, పీఏ & డీఈ ప్రాంతాలలోని మనబడి కేంద్రాల విద్యార్ధులు పాల్గొన్న స్నాతకోత్సవం న్యూజెర్సీలో జరిగింది. ఈ కార్యక్రమానికి  విచ్చేసిన  విశిష్ట అతిధి న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్, తెలుగు తేజం చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లకు ముందు అమెరికాకి వచ్చిన తెలుగువారి పిల్లలకి మన మాతృభాష తెలుగుని అందిస్తున్న మనబడి కృషిని, అందుకు సహకరిస్తున్న తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, మాతృభాష నేర్చుకోవడంతోనే మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అందుకే మనబడి ద్వారా తెలుగు నేర్పించడానికి 11 సంవత్సరాల క్రితం 150 మందితో ప్రారంభించామని, ఇప్పటికీ 35000 మందికి పైగా విద్యార్ధులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని, ఇంకా ఎన్నో వేలమంది రేపటి తరం తెలుగు భాషా సారధులను తయారుచేయడమే మనబడి ధ్యేయమని అన్నారు.  
 
అట్లాంటా : విజయ్ రావిళ్ల నేతృత్వంలో జరిగిన మనబడి స్నాతకోత్సవం అట్లాంటాలో అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ చేతులమీదుగా విద్యార్ధులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా, సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అమెరికా వ్యాప్తంగా దాదాపు 1300 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా 98% పైగా విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని అందుకు సహకరించిన మనబడి ప్రాంతీయ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, మనబడి కీలక బృంద సభ్యులు, మాతృభాషా ప్రేమికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనబడి 2018-19 విద్యా సంవత్సరపు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, సెప్టెంబర్ 8 నుండి తరగతులు ప్రారంభమౌతాయని, http://manabadi.siliconandhra.org ద్వారా ఆగస్ట్ 31 లోగా మనబడిలో చేరవచ్చని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. 

చికాగో : చికాగోలో జరిగిన మనబడి స్నాతకోత్సవానికి ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణతో పాటు మరో అతిధిగా విచ్చేసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా మనబడిని దగ్గరనుంచి చూస్తున్నానని, ఈ భాషాసేవ చేస్తున్న వారందరిలో మాతృభాష పట్ల నిబద్ధత చూశానని పేర్కొన్నారు. అందుకే మనబడి ఇంత విజయవంతంగా ఎంతోమంది ప్రవాస బాలలకు తెలుగు నేర్పగలుగుతోందని, ఇటీవల హైదరబాద్ లో జరిగిన ప్రపంచతెలుగు మహాసభల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి సైతం 'మనబడి ' గురించి తన ప్రసంగంలో పేర్కొనడం అందుకు నిదర్శనమని అన్నారు.

స్నాతకోత్సవ కార్యక్రమాలను సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పర్యవేక్షించగా, మనబడి ప్రాచుర్యం ఉపాధ్యక్షులు శరత్ వేట, రామాపురం గౌడ్, కిరణ్ దుడ్డగి, పవన్ బొర్ర, మాధురి దాసరి, శ్రీనివాస్ చివులూరి, సుజాత అప్పలనేని, విజయ్ రావిళ్ల, వెంకట్ గంగవరపు, ఖమ్మం జిల్లానుంచి వచ్చిన తెలుగు భాషోద్యమ నాయకులు పారుపల్లి కోదండ రామయ్య, మనబడి విద్యార్ధుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, భాషా ప్రేమికులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు