ఎక్కడి వారు అక్కడే ఉండండి

27 Mar, 2020 18:00 IST|Sakshi

 వాషింగ్టన్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పెద్దన్న అమెరికాను కూడా గడగడలాడిస్తుంది. రోజు రోజుకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా సోకి మరణించిన వారి సంఖ్యలో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికాలో కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నార్త్‌ అమెరికా ఆంధ్ర‍ప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధి రత్నకర్‌ ఆర్‌ పాండుగయాలా ఉత్తర అమెరికాలో ఉంటున్న తెలుగు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. 


‘దేశంలో ఏప్రియల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన కారణంగా  ట్రావెల్‌ బ్యాన్‌ కొనసాగుతుంది. అదే విధంగా గౌరవ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 2.5 లక్షల వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటిని సోదా చేస్తూ ఏ కొంచెం కరోనా లక్షణాలు ఉన్నా వారికి వెంటనే వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చరిత్రలో చూసి ఉండరు’ అని పేర్కొన్నారు. 


ఇంకా ఆయన మాట్లాడుతూ.... ‘నార్త్‌ అమెరికాలో ఉంటున్న తెలుగువారందరికి మీ కుటుంబం పట్ల మీరు భయపడాల్సిన పని లేదని  నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి పట్ల శ్రద్దతో కరోనా వైరస్‌వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మీరు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండండి. డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిన మార్గదర్శకాలు పాటించి కరోనా వైరస్‌ విస్తరించకుండా స్వీయ రక్షణ చర్యలు పాటించండి. ఎప్పటిప్పుడు చేతులను శానిటైజర్‌తో కడుక్కోండి. మీ ఇంట్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చూపించుకోండి. సామాజిక దూరాన్నిపాటించి ప్రభుత్వాలకు సహాకరించండి. మనం కలిసికట్టుగా  పోరాడితే ఈ కష్టకాలం నుంచి బయటపడవచ్చు’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు